ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) తమ జట్టు కోచింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా శ్రీలంక నూతన బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ బ్యాటింగ్ విక్రమ్ రాథోడ్‌ను నియమించింది. ఇప్పటికే శ్రీలంక ఫీల్డింగ్ కోచ్‌గా భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా విక్రమ్ రాథోడ్ ఈ జాబితాలో చేరాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో విక్రమ్ రాథోడ్, ఆర్ శ్రీధర్ భాగంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విక్రమ్ రాథోడ్ జనవరి 15న శ్రీలంక జట్టులో బ్యాటింగ్ కోచ్‌గా చేరనున్నాడు. విక్రమ్ రాథోడ్ 2019 నుంచి 2024 వరకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఆ సమయంలో భారత్ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరడంతో పాటు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వరకు భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. శ్రీలంక తమ లీగ్ మ్యాచ్‌లను సొంతగడ్డపైనే ఆడనుంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ బోర్డు భారత కోచ్‌లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆ దేశ దిగ్గజ పేసర్ లసిత్ మలింగాను నియమించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా పాకిస్థాన్‌తో శ్రీలంక మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక శుక్రవారం జరిగే రెండో టీ20లో గెలవాలనే కసితో ఉంది. ప్రపంచకప్‌లో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో తలపడనుంది.
ఫిబ్రవరి 8: శ్రీలంక vs ఐర్లాండ్ (కొలంబో)
ఫిబ్రవరి 12: శ్రీలంక vs ఒమన్ (పల్లెకెలె)
ఫిబ్రవరి 16: శ్రీలంక vs ఆస్ట్రేలియా (పల్లెకెలె)
ఫిబ్రవరి 19: శ్రీలంక vs జింబాబ్వే (కొలంబో)