భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ కోచ్ తుషార్ అరోథే చిక్కుల్లో పడ్డాడు. వడోదర స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు శనివారం ప్రతాప్‌గంజ్‌లోని తుషార్ అరోథే ఇంటిపై సోదాలు నిర్వహించి కోటి రూపాయాలు స్వాధీనం చేసుకున్నారు. అతని సన్నిహితుల వద్ద మరో 38 లక్షలు సీజ్ చేశారు.
చట్టవిరుద్దమైన పనులు చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు తుషార్ అరోథే ఇంటిపై రైడ్ చేసినట్లు తెలుస్తోంది. అరోథే కుమారుడు రిషి.. క్రికెట్ బెట్టింగ్, చీటింగ్ వంటి నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. తాజా రైడ్స్ నేపథ్యంలో అరోథే కుటుంబం మొత్తం ఈ బెట్టింగ్ రాకెట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.

సీజ్ చేసిన నగదుకు సంబంధించి అరోథే .. పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అతని సన్నిహితులు విక్రాంత్ రైపత్వార్, అమిత్ జనిత్‌ల వద్ద ఎస్‌ఓటీ పోలీసులు రూ. 38 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తుషార్ అరోథేపై బెట్టింగ్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు.
2019లోనే తుషార్ అరోథే ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌లో తొలిసారి అరెస్ట్ అయ్యారు. అతనితో పాటు 18 మందిని అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ వచ్చినా.. తుషార్ అరోథే కోచింగ్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడేలా చేసింది. 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత జట్టుకు అరోథే కోచ్‌గా వ్యవహరించాడు.
2018లో టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన.. తర్వాత అనేక చట్ట విరుద్ద కార్యక్రమాల్లో భాగమయ్యారు. బరోడా రంజీ టీమ్‌కు కూడా అరోథో కోచ్‌గా పని చేశారు.