టీమిండియా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌కు మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలువై సలహా ఇచ్చాడు. టీమిండియా బౌలర్‌గా ఎదగాలంటే.. మరింత కష్టపడాలని, ఎక్కువగా బౌలింగ్ చేస్తూ ఉండాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్‌కు మయాంక్ యాదవ్ దూరంగా ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్ అంతే వేగంగా గాయంతో ఆటకు దూరమయ్యాడు. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గాయం కారణంగా దేశవాళీ క్రికెట్‌కు అతను దూరంగా ఉన్నాడు.

ఈ క్రమంలోనే మయాంక్ యాదవ్.. మరిన్ని ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయాలని పరాస్ మాంబ్రే సూచించాడు. 'బౌలింగ్ చేయడానికి మయాంక్ యాదవ్ సిద్ధంగా లేడనే మాటను నేను అంగీకరించను.
ఇప్పుడు అతను ఆడటం లేదంటే. ఈ వయసులో కూడా ఎలా ఉన్నా సరే బౌలింగ్ చేయవచ్చు. కుర్రాడిగా ఉన్నప్పుడే మరింత ఎక్కువగా బౌలింగ్ చేయాలి. అప్పుడే బంతిపై నియంత్రణ దొరుకుతుంది. గాయపడ్డాడని, అతన్ని దూరంగా పెడితే ఎలా..? మయాంక్ మరింత మెరుగ్గా రాణించాలంటే బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఒక పేసర్‌గా.. మయాంక్‌ను ఫస్ట్‌క్టాస్ క్రికెట్ ఆడమని సూచిస్తా.

ఒక సీజన్ ఆడితేనే.. గాయం తర్వాత శరీరం ఎలా స్పందిస్తుందో తెలుస్తోంది. విభిన్న పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం వల్ల నైపుణ్యం పెంచుకునేందుకు వీలవుతుంది. మైదానంలో ఆరు సెషన్లపాటు గడిపితే.. ఎక్కువ సమయం బౌలింగ్ వేస్తూనే ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలంటే కఠిన శ్రమ చేయాల్సిందే. దేశవాళీ సీజన్‌లో మయాంక్ మరింత కష్టపడేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేయాలి.'అని పరాస్ మాంబ్రే చెప్పుకొచ్చాడు.