భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ మాజీ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ మృతి చెందారు. 83 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో అమెరికాలోని తన నివాసంలో కన్నుమూశారు. అబిద్ అలీ 1967-1975 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన కాలంలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మీడియం పేసర్‌గా.. బ్యాటర్‌గా.. మంచి ఫీల్డర్‌గా అభిమానుల మన్ననలు పొందారు. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ తరఫున రంజీ క్రికెట్‌లో అదరగొట్టి భారత జట్టుకు ఎంపికయ్యారు.
1967లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తన అరంగేట్ర మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే (6/55) ఆరు వికెట్లతో సత్తా చాటారు. 1971లో ఓవల్ వేదికగా గెలిచిన చారిత్రాత్మక టెస్ట్‌లో భారత జట్టు విజయ లాంఛనాన్ని అబిద్ అలీనే పూర్తి చేశారు. 1974లో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన అబిద్ అలీ.. 1975 ప్రపంచకప్ ఆడి జట్టులోనూ ఉన్నారు. తన కెరీర్‌లో మొత్తం 29 టెస్ట్‌లు ఆడి 47 వికెట్లతో పాటు 1018 పరుగులు చేశారు. 32 క్యాచ్‌లు అందుకున్నారు. ఐదు వన్డేలు ఆడి 7 వికెట్లు తీయడంతో పాటు 93 పరుగులు చేశారు.

అబిద్ అలీ మృతికి బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. హెచ్‌సీఏ సైతం అబిద్ అలీకి నివాళులర్పించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఎక్స్‌వేదికగా అబిద్ అలీ అకాల మృతికి సంతాపం ప్రకటించారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం అబిద్ అలీకి నివాళులర్పించారు.