భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ సందర్భంగా డ్యూక్స్ బాల్స్ నాణ్యతపై తీవ్ర చర్చ జరుగుతుంది. పట్టుమని పది ఓవర్ల పాటు కూడా బంతి నిలవడం లేదు. దాంతో అటు బౌలర్లు, ఇటు అంపైర్లకు తలనొప్పిగా మారింది. అంపైర్స్, ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. డ్యూక్స్ బాల్స్ నాణ్యత లేకపోవడం వల్ల కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగానే బంతి ఆకారం దెబ్బతింటుంది. దాంతో ఆటగాళ్లు పదే పదే బంతిని మార్చాలని అంపైర్లను కోరుతున్నారు. అంపైర్లు కూడా బాల్ గేజ్‌తో పరిశీలించి బాల్స్ మారుస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్లతో అంపైర్లకు వాగ్వాదం చోటు చేసుకుంటుంది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ నుంచే ఈ సమస్య మొదలైంది. బంతి త్వరగా ఆకారం కోల్పోవడం వల్ల సీమ్, స్వింగ్ లభించడం లేదు. లార్డ్స్ టెస్ట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ డ్యూక్స్ బాల్స్ నాణ్యత తీవ్ర చర్చనీయాంశమైంది. 80 ఓవర్ల తర్వాత భారత్ తీసుకున్న కొత్త బంతి కేవలం 63 బంతుల్లోనే ఆకారం కోల్పోయింది. దీంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బంతిని మార్చాలని అంపైర్‌ను కోరాడు. అయితే అంపైర్లు మార్చిన బంతి కూడా సరిగ్గా లేదని గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది 10 ఓవర్ల పాత బంతిలా కాకుండా 20 ఓవర్ల పాత బంతిలా ఉందని అసహనం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో అతను అంపైర్‌పై నోరుపారేసుకున్నాడు. సిరాజ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది 10 ఓవర్ల పాత బంతినా? అని ప్రశ్నించాడు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా గిల్‌కు మద్దతుగా నిలిచాడు. ఆ బంతి 20 ఓవర్ల పాతదిగా ఉందని వ్యాఖ్యానించాడు. మార్చిన బంతి కూడా 48 బంతుల్లోనే ఆకారం కోల్పోవడంతో మరోసారి మార్చాల్సి వచ్చింది. దాంతో డ్యూక్స్ బాల్స్ తయారీదారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. ఎక్స్‌వేదికగా తయారీదారులపై విమర్శలు గుప్పించాడు. 'క్రికెట్ బంతి ఒక అద్భుతమైన వికెట్ కీపర్‌లా ఉండాలి. అస్సలు గుర్తించబడకూడదు. కానీ ఇప్పుడు బంతి గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే బంతినే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రతీ ఇన్నింగ్స్‌లో బంతిని మార్చాల్సి వస్తుంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఐదేళ్లుగా ఇలాగే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. డ్యూక్స్ బాల్స్ ఒక సమస్యగా మారాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఒక బంతితో 80 ఓవర్లు ఆడాలి. 10 ఓవర్లు కాదు.'అని స్టువర్ట్ బ్రాడ్ ట్వీట్ చేశాడు.
డ్యూక్స్ బాల్స్‌పై వస్తున్న విమర్శలపై ఆ కంపెనీ స్పందించింది. బంతిని మరింత గట్టిగా తయారు చేస్తే.. బ్యాటర్లకు ఇబ్బందిగా మారుతుందని, అప్పుడు ఆట సమతుల్యతను దెబ్బతింటుందని ఆ కంపెనీ ప్రతినిధి దిలీప్ జాజోడియా తెలిపారు. ఈ తరం బ్యాటర్లు బంతిని బలంగా బాదడంతోనే బంతి త్వరగా ఆకారం కోల్పోతుందని చెప్పారు.