సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా హఠాన్మరణం

బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా (60) బుధవారం గుండెపోటుతో కన్నుమూశాడు. కొంత కాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవల మారడోనాకు శస్త్ర చికిత్స చేశారు. నవంబర్ 12న కోలుకొని ఇంటికి కూడా చేరుకున్నాడు. అయితే రెండు వారాల వ్యవధిలోనే అతను తుది శ్వాస విడిచాడు. బుధవారం మారడోనాకు గుండెపోటు రావడంతో తన ఇంట్లోనే మృతి చెందినట్టు అతని లాయర్ తెలిపాడు. కెరీర్, జీవితంలో డీగో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్ బారినపడి చావు అంచుల వరకు వెళ్లినా.. మళ్లీ రాగలిగాడు. అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.

గోల్డెన్ బాయ్
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో... నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 1986లో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్ డివిజన్ క్లబ్ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్ చివర్లో వచ్చిన వివాదాలతో అప్పటి వరకు సాధించిన ఘనతలపై నీలి నీడలు కమ్ముకున్నా... మైదానంలో అతని మంత్రముగ్ధమైన ఆటను చూసినవారెవరూ మారడోనాను మరచిపోలేరు. ‘గోల్డెన్ బాయ్'గా మారడోనా సాధించిన ఖ్యాతి అజరామరం.

పేదకుటుంబంలో..
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన దిగ్గజాల్లో మారడోనా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సాకర్ ప్రపంచాన్ని శాసించిన మారడోనా అసలు పేరు ‘డీగో అర్మాండో మారడోనా'. 1960 అక్టోబరు 30న అర్జెంటీనా, బ్యూన్‌సఎయిర్స్‌లో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి డిగో మారడోనా, తల్లి డల్మా సాల్వర్డో ప్రాంకో. నలుగురు అమ్మాయిల తర్వాత మారడోనా జన్మించాడు. అతడిని ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆటలో అద్భుతాలు చేసేవాడు. ఎనిమిదేళ్ల వయసులో స్థానికంగా జూనియర్ ట్రయల్స్ కోసం వెళ్లినప్పుడు అతని ఆటను చూసి కోచ్ ఫ్రాన్సిస్కో కార్నెజో అబ్బుపడ్డాడు.

16 ఏళ్ల వయసులో..
ఈ వయసులో ఇంత అద్భుత ఆటను ఎప్పుడూ చూడలేదంటూ ప్రోత్సహించి సరైన దిశలో నడిపించాడు. 16 ఏళ్ల వయసులో అర్జెంటీనోస్ జూనియర్ క్లబ్ జట్టుకు ఎంపిక కావడంతో అతని దశ తిరిగింది. ఆ తర్వాత ఎదురు లేకుండా దూసుకుపోయిన మారడోనా... సూపర్ స్టార్‌గా ఎదిగేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ప్రఖ్యాత క్లబ్‌లన్నీ రికార్డు మొత్తాలతో అతనితో కాంట్రాక్ట్‌లు కుదుర్చుకునేందుకు వెంట పడ్డాయి. బార్సిలోనా, నపోలీ జట్ల తరఫున అతను సాధించిన రికార్డులు అపూర్వం. మారడోనా రిటైర్మెంట్ తర్వాత నపోలీ క్లబ్ అతని ‘10' నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసింది.

విశ్వ వేదికపై...
1982లో మారడోనా తొలిసారి ప్రపంచ కప్ బరిలోకి దిగాడు. ఐదు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 1986 ప్రపంచకప్ అతడిని దిగ్గజంగా మార్చింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో కెప్టెన్‌గా, బెస్ట్ ప్లేయర్‌గా నిలిచి అర్జెంటీనాను చాంపియన్‌ను చేశాడు. 1990లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరి జర్మనీ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రభ తగ్గడం మొదలైంది. 1994 వరల్డ్ కప్‌లో కూడా ఆడినా... రెండు మ్యాచ్‌ల తర్వాతే డ్రగ్స్ ఆరోపణలతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications