హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 టికెట్ల వివాదం నేపథ్యంలో విజెలెన్స్ అధికారులు సిఫార్సు మేరకు సీఐడీ అదుపులోకి తీసుకుంది. హెచ్‌సీఏలో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరుపుతోంది. ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు అక్రమంగా హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చారని, నిధులను దుర్వినియోగం చేశారని గుర్తించిన సీఐడీ సమగ్ర విచారణ జరుపుతోంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు మొత్తం ఆరుగురు సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. హెచ్‌సీఏ జగన్ అరెస్ట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా భిన్నవాదనను తెరపైకి తీసుకొచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్‌తో పెట్టుకుంటే ఎవరైనా.. ఎంతటి పెద్దవారైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ కూడా కావ్య మారన్‌తో గొడవ పెట్టుకొని ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నాడని, ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యాడని ఆమె అభిమానులు గుర్తు చేస్తున్నారు. తాజాగా జగన్ మోహన్ రావు కూడా అదే తప్పు చేసి కటకటాల పాలయ్యారని అంటున్నారు.

ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో హెచ్‌సీఏకు వాగ్వాదం చోటు చేసుకుంది. అదనపు టికెట్ల కోసం హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు బెదిరింపులకు దిగుతున్నాడని సన్‌రైజర్స్ యాజమాన్యం ఆరోపణలు గుప్పించడం తీవ్ర దుమారం రేపింది. లక్నోతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు టీమ్ ఓనర్‌కు చెందిన కార్పోరేట్ బాక్స్‌కు హెచ్‌సీఏ తాళాలు వేసి బెదిరింపులకు దిగడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం సీరియస్ అయ్యింది.
నిబంధనల ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నా.. అదనంగా మరో 10 శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది. ఫ్రీగా టికెట్లు ఇచ్చేది లేదని సన్‌రైజర్స్ యాజమాన్యం చెప్పడంతో.. ఓపెన్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు టికెట్లు ఇవ్వాలని జగన్‌మోహన్ రావు డిమాండ్ చేశారని తెలిపింది. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే ఇస్తామని చెప్పామని, కానీ జగన్‌మోహన్ రావు వ్యక్తిగతంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడని హెచ్‌సీఏకు రాసిన మెయిల్‌లో పేర్కొంది. ఈ బెదిరింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్‌ను విడిచి వెళ్తామని కూడా హెచ్చరించింది. ఈ మెయిల్ లీక్ అవ్వడం.. మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించింది.
హెచ్‌సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు అదనపు టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు గుర్తించింది. ఈ మేరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రంగంలోకి దిగిన సీఐడీ.. హెచ్‌సీఏలో జరిగిన అవినీతిని కూడా గుర్తించి విచారణ ప్రారంభించింది. అసలు జగన్‌మోహన్ రావే అక్రమంగా అసోసియేషన్‌లోకి వచ్చి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని గుర్తించింది.
నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేశారని, గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టు సీఐడీ గుర్తించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి అరెస్ట్‌తో పాలన అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి జీతాలు ఇవ్వడం నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే సెలెక్టర్ల నియామకం వరకు అన్ని పనులు ఆగిపోయాయి.