పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై తానే సెటైర్లు పేల్చుకున్నాడు. బ్యాటర్ సూర్య తప్పిపోయాడని, అతను బలంగా తిరిగి వస్తాడని చెబుతూ నవ్వులూ పూయించాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్..టీమిండియా ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
'సిరీస్ ప్రారంభం నుంచే మేం ఒక ప్రత్యేకమైన శైలిలో క్రికెట్ ఆడాలని అనుకున్నాం. సరిగ్గా మేం అనుకున్నట్లే ఆడాము. కొత్తగా ఏం చేయలేదు. అన్ని విభాగాల్లో స్వేచ్చగా రాణించాలనుకున్నాం. మేం ఆశించిన ఫలితాలు దక్కాయి. గత కొన్ని సిరీస్‌ల్లో ఈ దూకుడును మేం కొంచెం మిస్ అయ్యాం. మేం సరిగ్గా ఇలానే ఆడాలనుకుంటున్నాం. బ్యాటర్ సెట్ అయ్యాక దూకుడును ఆఖరి వరకు కొనసాగించాలని కోరుకున్నాం. ఈ రోజు అది ఫలించింది.

బౌలింగ్‌లో కాస్త వినూత్నంగా చేయాలనుకున్నాం. పవర్ ప్లేలో బుమ్రాతో ఒక ఓవర్, డ్రింక్స్ తర్వాత మిడిల్ ఓవర్లలో వేయించి, డెత్‌లో మళ్లీ బౌలింగ్ చేయించాలనేది మా ప్రణాళిక. ఈ రోజు వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మాకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో మేం ఒత్తిడికి లోనయ్యాం. వాటిని మా కుర్రాళ్లు అద్భుతంగా అధిగమించారు.
ఇది ఓ అద్భుతమైన సిరీస్. మా లక్ష్యాలన్ని మేం అందుకున్నాం. బహుశా మాకు లోటుగా ఉన్న విషయం ఏదైనా ఉందా? అంటే 'బ్యాటర్ సూర్యను కనుగొనడం. అతను ఎక్కడో తప్పిపోయాడు(నవ్వుతూ). కానీ అతను మరింత బలంగా తిరిగి వస్తాడు. వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టుగా సంతోషంగా ఉన్నాను. మేం కష్టాల్లో ఉన్న ప్రతిసారీ, ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని మమ్మల్ని గట్టెక్కించారు. ఒక కెప్టెన్‌గా అది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.