ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న భారత్ పాక్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌ను ఎవరూ చూడవద్దని, బాయ్‌కాట్ చేయాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని మేజార్టీ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో కొడుకును కోల్పోయిన ఓ తండ్రి భారత ప్రభుత్వ ద్వంద వైఖరిని తప్పుబడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం, నీరు కలిసి ప్రవహంచలేవని చెప్పిన వ్యక్తులు.. ఇప్పుడు ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు.

ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో తన కుమారుడు శుభం ద్వివేదిని కోల్పోయిన సంజయ్ ద్వివేది, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణను తప్పుబట్టారు.
'ఏప్రిల్ 22న పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశంలోని 26 మంది అమాయకులను చంపారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో ఎటువంటి సంబంధాలు కొనసాగించదని ప్రకటించింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రకటించింది. కానీ ఇప్పుడు భారత్ పాకిస్థాన్ ఆసియా కప్ మ్యాచ్ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి నాతో పాటు ఈ దేశం మొత్తం వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్‌తో రాజకీయ, క్రీడా సంబంధాలు ఉండకూడదని అందరి అభిప్రాయం. ఈ మ్యాచ్‌ను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్య తీసుకోవాలి.'అని సంజయ్ ద్వివేది ఓ వార్త సంస్థతో కన్నీటి పర్యంతమయ్యారు.
సంజయ్ ద్వివేది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు సైతం ఈ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఆదిత్య థాక్రే కూడా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు క్రికెట్ ఆడకూడదని అభిప్రాయపడ్డారు. మరోవైపు #BoycottINDvsPAK అనే హ్యాష్ ట్యాగ్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
మరోవైపు భారత ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని స్పష్టం చేసింది. కానీ మల్టీ నేషనల్ టోర్నీల్లో మాత్రం పాక్‌తో భారత్ ఆడుతుందని పేర్కొంది. ఏసీసీ, ఐసీసీ రూల్స్ ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఆసియా కప్ 2025లో టీమిండియా శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం భారత్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.