
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ దక్కినప్పటికీ టైటిల్ మాత్రం కలగానే మిగిలిపోయింది. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్, బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టినా.. కప్ మాత్రం చేజారింది. అయితే ఇప్పుడు జోస్ బట్లర్‌కు ఎదురైన ఓ చేదు అనుభవమే ఆరేళ్ల కింద రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(కెప్టెన్) విరాట్ కోహ్లీకీ ఎదురైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆయా సీజన్లలో ఈ ఇద్దరు ఆడిన తీరు, తమ టీమ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన విధానాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి.. ఒక సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన రికార్డును నమోదు చేశాడు. ఆ ఏడాది నాలుగు సెంచరీలు బాదిన విరాట్.. ఆడిన ప్రతిమ్యాచ్‌లోనూ చెలరేగిపోయి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక తుదిపోరులో హాఫ్ సెంచరీ కొట్టినా సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తప్పలేదు. తాజా సీజన్‌లో జోస్ బట్లర్‌ది ఇదే పరిస్థితి. ఈ సీజన్‌లో అతనే టాప్ స్కోరర్. కోహ్లీ రికార్డును అందుకోలేదు కానీ.. 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. కోహ్లీ లాగే నాలుగు శతకాలు బాదాడు. ఫైనల్లోనూ తన జట్టును గెలిపించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నించాడు. అయినా జట్టుకు ఓటమి తప్పలేదు.
ఇక ఆ సీజన్‌లో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రెండో ప్లేస్లోనే నిలిచింది. ఇక అప్పుడు, ఇప్పుడూ టాప్‌లో గుజరాత్ టీమే ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే.. అప్పుడు కోహ్లీ, ఇప్పుడు బట్లర్.. మే 29నే ఫైనల్ ఆడారు. ఇలా ఆ సీజన్.. ఈ సీజన్‌లో అనేక పోలీకలు కలిసాయి. దాంతో అభిమానులు కోహ్లీ,బట్లర్‌ది ఒకే బాధని కామెంట్ చేస్తున్నారు.