టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవి శాస్త్రి జేబు దొంగతో పోల్చాడు. ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని కొనియాడుతూ పిక్ పాకెటర్ అనే పదాన్ని ఉపయోగించాడు. జేబు దొంగ కంటే ధోనీ చేతులు వేగంగా ఉంటాయని ప్రశంసించాడు. ధోనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఫేమ్‌లో చేర్చింది. ఈ సందర్భంగా లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రవి శాస్త్రి మాట్లాడుతూ.. ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ధోనీ చేతులు పిక్ పాకెటర్ కంటే వేగంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా భారత్‌లో.. ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని ఒక పెద్ద మ్యాచ్‌కి వెళ్తే, మీ వెనుక ధోనీ ఉండకుండ చూసుకోండి. లేదంటే మీ పర్స్ మాయమైపోతుంది'అని రవి శాస్త్రి అనగా అక్కడ నవ్వులు పూసాయి. ధోనీ వేగవంతమైన వికెట్ కీపింగ్‌ను ప్రశంసిస్తూ.. రవి శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తన కెరీర్‌లో మెరుపు వేగంతో ఎన్నో స్టంపౌట్స్, రనౌట్స్ చేశాడు. ధోనీ ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాడని రవి శాస్త్రి కొనియాడాడు. 'ధోనీ సున్నాకి ఔట్ అయినా.. ప్రపంచ కప్ గెలిచినా.. సెంచరీ కొట్టినా, డబుల్ సెంచరీ సాధించినా.. ఒకేలా ఉంటాడు. అతనిలో ఏ మాత్రం తేడా కనిపించదు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

హాల్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు. 'ప్రపంచవ్యాప్తంగా అన్ని తరాల క్రికెటర్ల సేవలను గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఎంతోమంది గొప్ప క్రికెటర్ల మధ్య నా పేరు ఉండబోతోందన్న భావనే అద్భుతంగా ఉంది. ఇది నా కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని క్షణం. చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.'అని ధోనీ తెలిపాడు.
భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ గుర్తింపు పొందారు. అతని నాయకత్వంలోనే భారత్ 2009లో టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ అసాధారణ విజయాలు, వికెట్ కీపర్‌గా అతని అద్భుతమైన ప్రతిభకు గుర్తింపుగా ఐసీసీ అతన్ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది.