ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అభిమానులకు ఘోర అవమానం ఎదురైంది. వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్వాహకులు హిట్ ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చారు.
రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్లకార్డ్స్‌ను మైదానం లోపలికి అనుమతించలేదు. దాంతో ప్లకార్డ్స్‌ను ఫ్యాన్స్ బయటే వేసి లోపలికి వెళ్లారు. భారీ సంఖ్యలో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌కు రాగా.. అతని పేరిట ఉన్న ప్లకార్డ్స్ చెత్త కుప్పను తలపిస్తోంది.

భయపడ్డ ముంబై ఫ్రాంచైజీ..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌ను చూసి ముంబై ఇండియన్స్ భయపడుతోందని కామెంట్ చేస్తున్నారు.
ఇతర మైదానాల్లో ప్లకార్డ్స్ అనుమతించినప్పుడు ఇక్కడ ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
కెప్టెన్సీ మార్పుతో..
కెప్టెన్సీ మార్పు నిర్ణయం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ మ్యాచ్‌లో సూటి పోటి నినాదాలతో హార్దిక్ పాండ్యాను గేలి చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మనే తమ కెప్టెన్ అంటూ హార్దిక్‌ను ఎగతాళి చేశారు. హార్దిక్ చేసే తప్పిదాలను భూతద్దంలో పెట్టి మరి చూస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు అనుకూలంగా ఉన్న ప్లకార్డ్స్‌ను ముంబై ఫ్రాంచైజీ అనుమతించలేదు. సెక్యూరిటీ అధికారుల సూచనలతోనే అనుమతించడం లేదని ముంబై ఫ్రాంచైజీ అధికారులు మీడియాకు వివరణ ఇచ్చారు.
రోహిత్ అభిమానుల ఆందోళన..
ఇక రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ అభిమానులు వాంఖడే స్టేడియం ముంగిట రచ్చ చేసారు. 'ముంబైకా రాజా రోహిత్ శర్మ'అంటూ నినాదాలు చేసారు. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో హాజరయ్యారు.