
ఢాకా: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ తీసుకున్న ఓ రివ్యూ తీవ్ర చర్చనీయాంశమైంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా ఇది మిగిలిపోయింది. అసలు రివ్యూ ఎందుకు తీసుకున్నాడో కూడా అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 112 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా టస్కిన్ మహ్మద్ వేసిన 48వ ఓవర్‌లో యార్కర్ బాల్‌ను ఆదిల్ రషీద్ డిఫెన్స్ చేశాడు. బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. టస్కిన్ అహ్మద్ రివ్యూ కోరాలని కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు సూచించాడు. దాంతో తమీమ్ రివ్యూ కోరగా.. రిప్లేలో అసలు బంతి ప్యాడ్‌కు తాకినట్లే కనిపించలేదు. బ్యాట్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. రివ్యూ ఎందుకు తీసుకున్నారో అటు బ్యాటర్, ఇటు అంపైర్‌కు అర్థం కాలేదు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ అని అభిమానులు మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 326 పరుగులు చేసింది. జాసన్ రాయ్(124 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 132) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ జోస్ బట్లర్(64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. షకీబ్, తైజుల్‌కు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ సామ్ కరన్(4/29), ఆదల్ రషీద్(4/45) ధాటికి 194 పరుగులకే కుప్పకూలింది. మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(69 బంతుల్లో 5 ఫోర్లతో 58) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.