డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకం..
ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ ముగిసిన 9 రోజులకే ఈ మెగా మ్యాచ్ ఉండటంతో భారత్ ప్రిపరేషన్స్‌కు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్న భారత ఆటగాళ్లంతా కలిసి ఓ చోట చేరి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్ వెళ్లడం.. పూర్తిగా భిన్నమైన ఫార్మాట్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతుండటం రోహిత్ సేనకు సవాల్‌గా మారింది.
లండన్ పరిస్థితులకు అలవాటు పడాలన్నా కనీసం 20 రోజుల ముందు టీమిండియా అక్కడికి వెళ్లాలి. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆటగాళ్ల సన్నద్ధతకు సంబంధించి ఓ ప్లాన్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో 10 జట్లు తలపడనుండగా.. మే 21 నాటికి 6 జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తాయి. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించని జట్లలోని ఆటగాళ్లను త్వరగా లండన్‌కు పంపించి అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడేలా చూస్తామని.. అక్కడ వాళ్లు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసేలా చర్యలు తీసుకుంటామని రోహిత్ తెలిపాడు.
అంతేకాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగమయ్యే భారత ఆటగాళ్లను మానిటర్ చేస్తామని, పేసర్లకు డ్యూక్ బాల్స్ ఇచ్చి ఐపీఎల్ జరుగుతుండగానే ప్రాక్టీస్ చేయిస్తామని పేర్కొన్నాడు. ఏ జట్టులో ఉన్నా.. డబ్ల్యూటీసీ కోసం సన్నదమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నాడు.
ఐపీఎల్ ఆడకపోతే చస్తారా?
రోహిత్ శర్మ చెప్పిన ఐడియా వినడానికి బాగానే ఉన్నా.. ప్రాక్టీకల్‌గా అమలయ్యేది కష్టంగా అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్, సూర్య, ఇషాన్.. ఆర్‌సీబీలో కోహ్లీ, సిరాజ్.. చెన్నైలో జడేజా, రాజస్థాన్ రాయల్స్‌లో అశ్విన్, గుజరాత్ టైటాన్స్‌లో శుభ్‌మన్ గిల్, లక్నోలో కేఎల్ రాహుల్.. ఇలా కీలక ఆటగాళ్లంతా వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడుతున్నారని, ప్రధాన ఆటగాళ్లకు సంబంధించిన జట్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరితే పరిస్థితి ఏందని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. అసలు టీమిండియాకు ఐపీఎల్ ముఖ్యమా? లేక ఐసీసీ టైటిలా? అని ప్రశ్నిస్తున్నారు.
ఐసీసీ టైటిల్ కోసం త్యాగం చేయలేరా..?
ఐసీసీ టైటిల్ కోసం ఐపీఎల్ మ్యాచ్‌లను వదులుకోలేరా? అని మండిపడుతున్నారు. ఐపీఎల్ ఆడకుంటే బీసీసీఐ, భారత ఆటగాళ్లు ఏమైనా అడుక్కుతింటారా? అని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఐపీఎల్‌ను కాదని డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సిద్దమవ్వడమే ముఖ్యమని సూచిస్తున్నారు. రోహిత్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌సీబీ, ముంబై, చెన్నై, రాజస్థాన్, గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












