ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు మరో ఓటమి ఎదురైంది. ప్రత్యర్థి వేదికలపై విజయాలు సాధిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. సొంతగడ్డపై మాత్రం తేలిపోతుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 9 వికెట్లకు 95 పరుగులే చేసింది. టీమ్ డేవిడ్ ఒక్కడే(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లలో రజత్ పటీదార్(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ(1), ఫిల్ సాల్ట్(4), లివింగ్ స్టోన్(4), జితేశ్ శర్మ(2), కృనాల్ పాండ్యా(1) తీవ్రంగా నిరాశపరిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/23), మార్కో జాన్సెన్(2/10), యుజ్వేంద్ర చాహల్(2/11), హర్ప్రీత్ బ్రార్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నెహాల్ వధేరా(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33 నాటౌట్) రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/14) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.
కొంపముంచిన కోహ్లీ సలహా..
96 పరుగులే లక్ష్యాన్ని కూడా ఆర్‌సీబీ బౌలర్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అద్భుత బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ కీలక బ్యాటర్లను ఔట్ చేశారు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 36 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సుయాష్ శర్మ.. క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరాను ఇబ్బంది పెట్టాడు. వరుసగా నాలుగు బంతులను డాట్ చేశాడు. ఈ నాలుగు బంతులును నెహాల్ వధేరా టచ్ చేయలేకపోయాడు.
ఐదో బంతిని నెహాల్ వధేరా రివర్స్ స్వీప్ షాట్ ఆడగా.. బంతి లక్కీగా బౌండరీ వెళ్లింది. ఆ మరుసటి బంతికి ముందుకు పరుగెత్తుకొచ్చిన కోహ్లీ.. సుయాశ్ శర్మకు పలు సూచనలు చేశాడు. ఆఖరి బంతిని సుయాశ్ శర్మ ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించగా.. నెహాల్ వధేరా లాంగాన్ దిశగా సిక్స్ బాది మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు.
షాడో కెప్టెన్సీతో సమస్య..
కోహ్లీ ఏం సలహా ఇచ్చాడో ఏమో తెలియదు కానీ.. సిక్సర్ వెళ్లడంతో అతని సలహా మిస్ ఫైర్ అయ్యిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మరుసటి ఓవర్‌ను హజెల్ వుడ్ కట్టుదిట్టంగా వేసి 2 పరుగులే ఇచ్చాడు. దాంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. కానీ సుయాష్ తన మూడో ఓవర్‌లో వధేరా 6, 4b, 4 బాది పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు.
రజత్ పటీదార్‌కు విరాట్ కోహ్లీ షాడో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని, అతనికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల్లో పదే పదే జోక్యం చేసుకుంటున్నాడని మండిపడుతున్నారు. తన మాట వినకపోతే.. కోహ్లీ బాహటంగానే రజత్ పటీదార్‌ను మందలిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు.