టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించింది. మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఎలాంటి సంచలనాలకు తావివ్వని బీసీసీఐ.. రెగ్యులర్ ఆటగాళ్లనే తీసుకుంది.
రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టింది. తుది జట్టులో ఉంటారని భావించిన శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను స్టాండ్ బై లిస్ట్‌లో చేర్చింది. మే 15లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

రింకూ సింగ్‌ను ఎంపిక చేయరా..?
ఆలోపు పరిస్థితులు మారి స్టాండ్ బై ఆటగాళ్లు ప్రధాన జట్టులోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రింకూ సింగ్‌ను ప్రధాన జట్టులోకి తీసుకోకపోవడంతో పాటు టీ20 ఫార్మాట్‌లో గతేడాదిగా నిలకడగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశవాళీ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన రికార్డ్ ఉందని గుర్తు చేస్తున్నారు. కొందరైతే రోహిత్ శర్మ ప్రపంచకప్ ప్రదర్శనలను కామెంట్ చేస్తూ ఎందుకు ఎంపిక చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఎంపికకాకపోవడానికి ప్రధాన కారణం రాహుల్ ద్రవిడేనని ఆరోపిస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్ రాజకీయం..
అండర్ 19 ప్రపంచకప్ జట్టు నుంచి రుతురాజ్ గైక్వాడ్‌కు రాహుల్ ద్రవిడ్ అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండర్ 19 ప్రపంచకప్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సమయంలోనూ రాహుల్ ద్రవిడ్.. రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకుండా పక్కనపెట్టాడని, ఇప్పుడు కూడా అదే చేశాడని గుర్తు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసేందుకు అవకాశం లేదని, యశస్వి జైస్వాల్‌కు అతని కంటే మెరుగైన రికార్డు ఉండటంతో పాటు లెఫ్టాండ్ బ్యాటర్ కావడంతో అతనికి అవకాశం ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా భారత ప్రపంచకప్ జట్టు ఎంపికపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
స్టాంబ్‌బై ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్