లండన్: బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. చెత్త ఆటతీరుతో అభిమానులతో పాటు విమర్శకుల ఆగ్రహానికి గురయ్యాడు. మొన్నటి వరకు ఐపీఎల్ 2023 సీజన్ వైఫల్యం, ఇన్‌స్టా మోడల్ స్వప్నా గిల్‌తో గొడవ కారణంగా అనవసర వివాదాలతో వార్తల్లో నిలిచిన పృథ్వీ షా.. తాజాగా ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో విచిత్రకరంగా ఔటై మరోసారి అందరి దృష్టిని ఆక్షరించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా సన్నదమవుతున్న పృథ్వీ షా ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే టోర్నీలో ఆడుతున్నాడు. నార్తాంప్టన్ షైర్ టీమ్ తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ షా(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 34) పుల్ షాట్ ఆడబోయి హిట్ వికెట్ అయ్యాడు.

వాన్ మికీరన్ వేసిన బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పృథ్వీ షా.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డాడు. ఈ క్రమంలో అతని కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్ కిందపడి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫిట్‌నెస్‌పై అంతగా శ్రద్ద పెట్టని పృథ్వీ షా.. బరువెక్కాడు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అభిమానులు పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సాయిబాబాను ఎక్కువగా నమ్మే పృథ్వీషాను ఆ దేవుడి పేరుతోనే సెటైర్లు పేల్చారు. 'సాయి బాబా.. ఈ పృథ్వీ షా ఇక మారడు'అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేశారు.
ఇటీవల ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లోనూ పృథ్వీ షా విఫలమయ్యాయని వార్తలు వచ్చాయి. అండర్ 19 ప్రపంచకప్ విజేతగా భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు.
ఆరంభంలో పృథ్వీ షా ఆటతీరును చూసి విశ్లేషకులు భారత క్రికెట్‌ను ఏలుతాడని ప్రశంసించారు. వారు అన్నట్లుగానే పృథ్వీ షా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన అతను మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.
అనవసర గొడవలతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. పృథ్వీ షాలో అపారమైన ప్రతిభ ఉన్నా, నిర్లక్ష్యం, బద్ధకంతో దాన్ని వృథా చేసుకుంటున్నాడని, ఇప్పటికైనా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టకపోతే ఐపీఎల్‌కు కూడా దూరమవుతాడని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.
ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే టోర్నీలో పృథ్వీ షా ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తాంప్టన్‌షైర్ 23 పరుగుల తేడాతో గ్లౌసెస్టర్‌షైర్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ 48.4 ఓవర్లలో 278 పరుగులకు కుప్పకూలింది. అనంతరం నార్తాంప్టన్‌షైర్ 48.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఓటమిపాలైంది.