టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాయి. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే గంభీర్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం.. మూడు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించడం, అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం చేయడం వంటి విషయాలు జట్టుకు తీరని నష్టం చేస్తాయనే అభిప్రాయం కలుగుతోంది. పూర్తి ఫిట్‌నెస్ లేనిదే హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ 2024 ఆడించారా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.

వాస్తవానికి హార్దిక్ పాండ్యా సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 కోసం సిద్దమైంది. కుర్రాళ్లతో కూడిన భారత జట్టు హార్దిక్ సారథ్యంలో టీ20 సిరీస్‌లు ఆడింది. అయితే వన్డే ప్రపంచకప్ 2023లో హర్దిక్ పాండ్యా గాయపడటంతో టీ20 ప్రపంచకప్ వ్యూహాలన్నీ మారిపోయాయి. లేకుంటే టీ20 ప్రపంచకప్ 2024లో హార్దిక్ పాండ్యానే సారథ్యం వహించాడు.
అయితే ఫిట్‌నెస్ సమస్యలతో హార్దిక్ పాండ్యా గాయపడలేదనే విషయాన్ని గంభీర్, సెలెక్టర్లు గ్రహించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి రన్నప్‌లోనే బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ షాట్‌ను కాలితో ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని మడిమకు తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మరోసారి జట్టుకు దూరమయ్యాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్‌నెస్ సాధించేందుకు హార్దిక్ తీవ్రంగా కష్టపడ్డాడు. ఐపీఎల్ 2024లో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో అటు బంతి, ఇటు బ్యాట్‌తో సత్తా చాటి టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అసాధారణ బౌలింగ్‌తో టీమిండియా టైటిల్ గెలిచేలా చేశాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని వారసుడిగా హార్దిక్ పాండ్యానే టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ నయా హెడ్ కోచ్ గంభీర్.. అతన్ని పక్కనపెట్టి సూర్యను తెరపైకి తీసుకొచ్చాడు. ప్రతీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేవాడే కెప్టెన్‌గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని గంభీర్ తెలిపాడు. అయితే సూర్యకుమార్ యాదవ్‌కు గాయం కాదా? అని గంభీర్‌ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఆటలో గాయపడటం సహజం. కానీ ఫిట్‌నెస్ సమస్యలను కారణంగా చూపిస్తూ.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం అన్యాయమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్.. మరో ఛాపెల్‌లా జట్టుకు అన్యాయం చేస్తాడని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.