భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మూడో రోజు ఆట కూడా రద్దయ్యింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇప్పటికే తొలి రోజు ఆటలో 55 ఓవర్లు మింగేసిన వరణుడు.. రెండో రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడనివ్వలేదు. మూడో రోజు వర్షం లేకపోయినా.. మైదానంలోని ఓవైపు ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు.
అర్థ రాత్రి కురిసిన భారీ వర్షంతో ఔట్ ఫీల్డ్‌లో ఓవైపు పూర్తిగా నీరు నిలిచిపోయింది. గ్రౌండ్ స్టాఫ్ వాటిని తొలగించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. దాంతో ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా మైదానంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉంటే మైదానంలో నీళ్లు నిలిచేవి కావని కామెంట్ చేస్తున్నారు. భారీ వర్షంతో మైదానంలో నీళ్లు నిలిచిపోవడంతో ఔట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. కాళ్లు దిగబడుతుండటంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటను కొనసాగించడం కష్టమని తేల్చేసారు. కోట్ల రూపాయాల ఆదాయం ఉన్న బీసీసీఐ.. మైదానాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. మైదానాలను చక్కదిద్దడంలో అలసత్వం ప్రదర్శిస్తుందని విమర్శిస్తున్నారు. దొంగ లేక్కలతో బోర్డు ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయితే దానికి బాధ్యులు ఎవరూ? అని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి మైదానాలను ఆధునీకరించాలని సూచిస్తున్నారు. వర్షం పడినా క్షణాల్లో మైదానం సిద్దమయ్యేలా డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. మూడో రోజు ఆట కూడా రద్దవ్వడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చివరి రెండు రోజుల ఆట సాధ్యమైనా.. అద్భుతం జరిగితే తప్పా ఫలితం తేలడం కష్టం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి రోజు వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్‌మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) విఫలమయ్యారు.

భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించింది.
చివరి రెండు రోజులు ఆట సాధ్యమయ్యే అవకాశాలు ఉండటం.. కాన్పూర్ అభిమానులకు పెద్ద ఊరట.
ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే టీమిండియాకు నష్టం జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాకు ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఒక వేళ మ్యాచ్ డ్రా అయితే .. తదుపరి 8 టెస్ట్‌ల్లో 6 మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌లు.. ఆస్ట్రేలియా గడ్డపై 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది.
- No rain in Kanpur.
— Jod Insane (@jod_insane) September 29, 2024
- No drainage system.
- Not a single ball has been bowled in two days.
- These are the facilities provided by the so called richest cricket board.
If the Ind vs Ban test is a draw, who is responsible? This corrupt board isn’t serious at all. pic.twitter.com/XaxIB9rhyn