పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలిపై క్రికెట్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అతని శైలి త్రో బౌలింగ్‌లా ఉందని ఆరోపిస్తున్నారు. బౌలింగ్ చేసే సమయంలో అతను చేతిని ఆపి మరి బౌలింగ్ చేస్తున్నాడని, ఈ బౌలింగ్‌ను ఎలా అనుమతించారని ఐసీసీని నిలదీస్తున్నారు. అతని బౌలింగ్ గల్లీ క్రికెటర్ బౌలర్‌ను తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో కొలంబో వేదికగా జరిగన మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఉస్మాన్ తారిక్(3/27) మూడు వికెట్లతో సత్తా చాటాడు. తన వినూత్నమైన బౌలింగ్‌తో అమెరికా పతనాన్ని శాసించాడు. అతని ప్రదర్శన కంటే బౌలింగ్ శైలి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది తొండాట అని, అతని బౌలింగ్‌ను పరీక్షించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ అతని బౌలింగ్‌కు కామెరూన్ గ్రీన్ కూడా షాకయ్యాడు. అతని బౌలింగ్‌పై సందేహం వ్యక్తం చేశాడు. అయితే అతని బౌలింగ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మిస్టరీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ తారిక్.. బంతిని విసిరే ముందు తన చేతులను విభిన్న కోణాల్లో తిప్పుతూ.. బ్యాటర్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తాడు. అతని యాక్షన్‌లో ఒక రకమైన 'హెజిటేషన్'ఉంటుంది. ఆగి ఆగి వేయడం వల్ల బ్యాటర్ టైమింగ్‌ను దెబ్బతింటుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం, బంతిని విడుదల చేసే సమయంలో బౌలర్ చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగకూడదు. ఉస్మాన్ తారిక్ యాక్షన్‌లో చేయి వంగడం లేదని ప్రాథమికంగా తేలడంతో అతనికి అనుమతి లభించింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సమయంలో అతని బౌలింగ్ యాక్షన్ గురించి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అతను బంతిని విసురుతున్నాడని ఆరోపించారు. గతంలో ఒకసారి అతని యాక్షన్‌పై అనుమానాలు రావడంతో 'సస్పీషియస్ బౌలింగ్ యాక్షన్'కింద రిపోర్ట్ అయ్యింది. కానీ, అతను తన యాక్షన్‌ను సరిదిద్దుకుని మళ్ళీ మైదానంలోకి వచ్చాడు.
ఉస్మాన్ తారిఖ్ చాలా వేగంగా ఫ్లిప్పర్లు, క్యారమ్ బాల్స్ వేయగలడు. బంతిని విడుదల చేసేటప్పుడు అతని చేయి చాలా కిందకు ఉంటుంది, దీనివల్ల బంతి తక్కువ ఎత్తులో వచ్చి బ్యాటర్‌ను ఇబ్బంది పెడుతుంది. బ్యాటర్లు అతని వేళ్లను చూసి బంతి ఏ దిశలో వస్తుందో కనిపెట్టడం చాలా కష్టం. ఈ కారణాలతోనే ఉస్మాన్ తారిఖ్‌ను పాకిస్థాన్ తమ జట్టులోకి తీసుకుంది. అతని బౌలింగ్ యాక్షన్‌పై మ్యాచ్ రిఫరీ అభ్యంతరం చెప్పేంత వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాడు.