హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను మాత్రం 2-3తో కోల్పోయింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. అయితే ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
ఐదు టీ20ల్లో 173 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా తొలి ఐదు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. దీపక్ హుడా(215), కేఎల్ రాహుల్(187) తిలక్ వర్మ కంటే ముందున్నారు. యాదృశ్చికమో ఏమో కానీ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. తిలక్ వర్మ మధ్య చాలా పోలికలు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఒకటి.. రెండు కాదు.. పది పోలికలు ఉండటంతో తిలక్ వర్మ రూపంలో రైనా మళ్లీ వచ్చాడా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ రైనా, తిలక్ వర్మ ఇద్దరూ కూడా నవంబర్‌లోనే పుట్టడం గమనార్హం. నవంబర్ 27న సురేశ్ రైనా.. నవంబర్ 8న తిలక్ వర్మ జన్మించారు. సురేశ్ రైనా తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేయగా.. తిలక్ వర్మ కూడా సెకండ్ ఐపీఎల్ మ్యాచ్‌లోనే అర్థ శతకం నమోదు చేశాడు.
ఐపీఎల్‌లో తొలి రెండు సీజన్లలో సురేశ్ రైనా 350 ప్లస్ స్కోర్ చేయగా.. తిలక్ వర్మ కూడా అన్నే పరుగులు చేయడం గమనార్హం. ఐపీఎల్ 2008లో 421 పరుగులు చేసిన రైనా.. 2009లో 434 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ అరంగేట్ర సీజన్‌లోనే 397 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 343 రన్స్ నమోదు చేశాడు.
20 ఏళ్ల వయసులో సురేశ్ రైనా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తే.. తిలక్ వర్మ కూడా ఇదే వయసులో అరంగేట్రం చేశాడు. రంగేట్ర మ్యాచ్‌లో సురేశ్ రైనా రెండు సూపర్ క్యాచ్‌లు తీసుకుంటే.. తిలక్ వర్మ కూడా రెండే క్యాచ్‌లు అందుకున్నాడు. సురేశ్ రైనా తొలి హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురవ్వగా.. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్‌లోనూ పరాజయం తప్పలేదు.
రైనా హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకోగా.. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ సరిగ్గా 18.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఛేజింగ్‌లో సురేశ్ రైనా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 49 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్ వర్మ సైతం 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
టీ20ల్లో సురేశ్ రైనా వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ తీయగా.. తిలక్ వర్మ సైతం తన తొలి ఓవర్‌లోనే వికెట్ అందుకున్నాడు. విండీస్‌తో ఆదివారం జరిగిన ఐదో టీ20లో బౌలింగ్ చేసిన తిలక్ వర్మ రెండో బంతికే నికోలస్ పూరన్‌ను ఔట్ చేశాడు.