లండన్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. వరుస వైఫల్యాలకు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. పేలవ ఫామ్, అనవసర గొడవలతో ఫేడ్ ఔట్ అయిన పృథ్వీ షా.. మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు శ్రమిస్తున్నాడు. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లోని దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా.. డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో 24 ఫోర్లు, 8 సిక్స్‌లతో ద్విశతకం అందుకొని బౌలర్లను ఊచకోత కోసాడు. ఈ టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్‌లో 39 బౌండరీలు ఉండటం విశేషం.

81 బంతుల్లో సెంచరీ అందుకున్న పృథ్వీ షా.. మరో 48 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఔటైన పృథ్వీ షా మొత్తం 28 ఫోర్లతో పాటు 11 సిక్స్‌లు బాదాడు. దాంతో నార్తాంప్టన్ షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు చేసి.. ఇంగ్లండ్ వన్డే కప్ టోర్నీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పృథ్వీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డే కప్‌లో ఓలీ రాబిన్సన్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 పరుగులను పృథ్వీ షా అధిగమించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. పురుషుల లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇది రెండో వ్యక్తిగత స్కోర్. 2002 గ్లోకోస్టర్ ట్రోఫీలో అలీ బ్రాన్స్ 268 రన్స్ చేశాడు. అత్యధిక లిస్ట్ ఏ డబుల్ సెంచరీలు కలిగిన రెండో భారత ప్లేయర్‌గా పృథ్వీ షా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ముందున్నాడు. వన్డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పృథ్వీ షా.. చతేశ్వర్ పుజారాను అధిగమించాడు.
ఇక పృథ్వీ షా ఇన్నింగ్స్‌తో అతని ఇష్ట దైవం సాయిబాబానే షాకయ్యాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో చివరిసారిగా పృథ్వీ షా డబుల్ సెంచరీ బాదాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున 227 పరుగులు చేశాడు.