పుదుచ్చేరి: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్... దేవధర్ ట్రోఫీలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సౌత్ జోన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. వికెట్ల వెనుకాల కళ్లు చెదిరే విన్యాసం చేశాడు. సౌత్ జోన్ బ్యాటర్ రికీ భూయ్ ఇచ్చిన క్యాచ్‌ను చేప పిల్లలా దూకి అందుకున్నాడు.
మయాంక్ యాదవ్ వేసిన 39వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసిన బాడీలైన్ బాల్‌ను రికీ భూయ్ ఫస్ట్ స్లిప్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. అప్పటికే రికీ భూయ్ ఫుట్‌వర్క్‌ను గమనించిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. లెఫ్ట్ సైడ్ జరిగిన రైట్ సైడ్ అమాంతం గాల్లోకి డైవింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ప్రభ్‌సిమ్రాన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. ఇదేం క్యాచ్‌రా అయ్యా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో వీజేడీ పద్దతిన నార్త్ జోన్ 185 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 303 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(64), ఓపెనర్ కున్నమ్మల్(70), జగదీశన్(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో నార్త్ జోన్ లక్ష్యాన్ని వీజేడీ(వి జయదేవన్) పద్దతిన 246 పరుగులకు కుదించారు.
సౌత్ జోన్ బౌలర్లు విధ్వత్ కావేరప్ప(5/17), విజయ్ కుమార్ వైశాఖ్(2/12), వాసుకి కౌశిక్(1/11) సత్తా చాటడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది.