అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇషాంత్ శర్మ వేసిన 21వ ఓవర్ చివరి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుందామని చెప్పగా ఇతర ఆటగాళ్లంతా వద్దని వారించారు. బంతి.. బ్యాట్‌కు తగిలిందనే సందేహం వ్యక్తం చేయడంతో వికెట్ల మీదుగా వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కానీ వికెట్‌పై గట్టి విశ్వాసంతో కనిపించిన కోహ్లీ ఎవరూ చెప్పినా వినకుండా రివ్యూ తీసుకున్నాడు. తీరా రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకలేదు. పైగా బాల్ ట్రాకర్‌లో మిడిల్ వికెట్‌ను హిట్ చేయడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో కోహ్లీ ప్రపంచకప్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లు సైతం కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మెచ్చుకున్నారు. రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీని హగ్ చేసుకోని మరి అభినందించాడు.
ఎవడ్రా విభేదాలున్నాయంది?
ఇక్కడ బెయిర్ స్టో వికెట్ కన్నా.. రోహిత్-కోహ్లీ హగ్ చేసుకోవడమే అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే గతకొన్ని రోజులుగా విరాట్-రోహిత్ మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. వీరి ప్రవర్తన కూడా ఆ ప్రచారానికి దారి తీసింది. కానీ తాజాగా కోహ్లీ-రోహిత్ మధ్య ఉన్న సంబంధం చూస్తుంటే వారి మధ్య ఏ తగాదాలు లేవనే విషయం స్పష్టం అవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతమైన ఫోటోనని ఒకరంటే.. ఇది రోహిత్, విరాట్ బ్రోమాన్స్ అని మరొకరు ట్వీట్ చేశారు.
గట్టిగా పట్టుకున్నాడు..
బెయిర్ స్టో వికెట్ కన్నా.. కోహ్లీ, రోహిత్ కౌగిలించుకోవడం తమకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు. మరో అభిమాని ఈ ఫొటోను ప్రస్తావిస్తూ మీడియాపై సెటైర్లు పేల్చాడు. 'రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ మధ్య విభేదాలున్నాయని ఈ ఫొటోతో స్పష్టమైంది. ఎందుకంటే రోహిత్‌ను కోహ్లీ గట్టిగా పట్టుకున్నాడు.'అని కన్నుకొట్టే ఫన్నీ ఇమేజ్‌తో సెటైర్లు పేల్చాడు. తన ట్వీట్ ద్వారా వారి మధ్య ఏ విభేదాలు లేకున్నా మీడియా కల్పించి రాస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
చారిత్రాత్మక విజయం..
ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన అద్భుత విజయాన్నందుకుంది. అసాధారణమైన ఆటతీరుతో డ్రాగా ముగిసే మ్యాచ్‌లో 151 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టింది. 181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13) ఒక వికెట్ దక్కింది.


Click it and Unblock the Notifications
