టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆటగాళ్ల క్రమశిక్షణకు సంబంధించి బీసీసీఐ ప్రవేశపెట్టబోతున్న 10 కొత్త రూల్స్ కోహ్లీని కట్టడి చేసేందుకే తెచ్చారనే అభిప్రాయం కలుగుతోంది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన ఘోర పరాజయంపై ఇటీవలే సమీక్ష సమావేశం నిర్వహించిన బీసీసీఐ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలతో ఈ నయా రూల్స్‌ను అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే భారత జట్టుతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.

జట్టులో స్టార్ సంస్కృతికి తెరదించేందుకు ఈ రూల్స్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించడంపై ఆంక్షలు విధించింది. ప్రాక్టీస్ సెషన్స్ మధ్యలో వెనుదిరగడం.. మ్యాచ్‌ల సందర్భంగా సొంత వాహనాల్లో ప్రయాణించడంపై నిషేధం విధించింది. ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని పేర్కొంది. విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి పర్సనల్ షూట్స్ లేదా ఎండార్స్‌మెంట్స్‌లో పాల్గొనడానికి వీలు లేదని తెలిపింది.
అయితే ప్రస్తుతం టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రమే.. విదేశీ పర్యటనలకు కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్తున్నారు. జట్టుతో కాకుండా ప్రత్యేకంగా ప్రయాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ తన స్పెషల్ ఫ్లైట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నాడు. అతనితో పాటు హెయిర్ హోస్టెస్, మేనేజర్, కుక్, పిల్లల సంరక్షకులు కూడా ప్రయాణిస్తున్నారు.
ప్రస్తుతం కోహ్లీ అనేక ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహారిస్తున్నాడు. సిరీస్ మధ్యలో మ్యాచ్‌లు లేని సమయంలో వాటికి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్, యాడ్స్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కోహ్లీతో పాటు బుమ్రా, రోహిత్ కూడా చాలా బ్రాండ్లకు అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది వెంటే ఉండటంతో జట్టుతో కాకుండా వేరుగా హోటల్ రూమ్స్‌లో ఉంటున్నారు. ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు.
గంభీర్ జట్టులోకి రాకముందు వరకు ఇవేవి జట్టుకు సమస్యలుగా మారలేదు. కానీ ఇటీవల టీమిండియా దారుణంగా విఫలమవ్వడంతో స్టార్ ఆటగాళ్ల వ్యవహార శైలి ప్రశ్నార్థకంగా మారింది. ఈ ముగ్గురిని కట్టడి చేసేందుకే ముఖ్యంగా కోహ్లీని లక్ష్యంగా చేసుకొని కొత్త రూల్స్‌ను తయారు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విరాట్ కోహ్లీ కెరీర్‌ను త్వరగా ముగించాలనే ఉద్దేశంతోనే అతనికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గంభీర్‌కు అనుకూలంగా ఉండే ఓ మీడియా ఛానెల్ సైతం కోహ్లీని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కోహ్లీనే స్వయంగా తప్పుకునేలా అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని మాజీ క్రికెటర్లు, అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీని ఒక్కడినే టార్గెట్ చేసిన సదరు ఛానెల్.. రోహిత్ శర్మ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లోకి క్రికెట్‌ను లాగవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.