ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లు నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. పటిష్టమైన న్యూజిలాండ్‌తో పోరు హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో విజృంభించడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను కూడా రోహిత్ సేన మట్టికరిపించింది.
ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగే సెమీఫైనల్లోనూ ఇదే జోరు కనబర్చి ఫైనల్ చేరాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో పోటీ పడలేదు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సీనియర్ల గైర్హాజరీలో సంచలన ప్రదర్శనతో పాటు వరుణిడి సాయంతో సెమీస్ బెర్త్ దక్కించుకున్న ఆసీస్.. టీమిండియాకు మరోసారి షాకివ్వాలని భావిస్తోంది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పటిష్టంగా ఉండటంతో పాటు సమష్టి ప్రదర్శనలతో విజయం సాధిస్తోంది.

మరోవైపు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో ఇండియా మాస్టర్స్ సైతం దుమ్మురేపుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సచిన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడి వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆడుతున్న ఈ టోర్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
శ్రీలంక మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్ జట్లను ఓడించిన ఇండియా మాస్టర్స్.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ రోహిత్ శర్మతో పాటు సచిన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక్కడ రోహిత్.. అక్కడ సచిన్ రప్పా రప్పా.. రఫ్ఫాడిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.