ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ 2025ని నిరాకరించేందుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కాగా.. ఆ టైటిల్‌ను మోహ్‌సిన్ నఖ్వీ తన వెంట తీసుకెళ్లాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ అయిన మోహ్‌సిన్ నఖ్వీ ఆ దేశ కేంద్ర మంత్రిగా కూడా పని చేస్తున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోలేమని భారత్ స్పష్టం చేసింది. కానీ అతను మాత్రం తానే ట్రోఫీని అందిస్తానని మొండి చేశాడు. చివరకు భారత్ ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది. ఇప్పటికీ ఆ ట్రోఫీని మోహ్‌సిన్ నఖ్వీ భారత్‌కు అందజేయలేదు. ట్రోఫీ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

తాజాగా ఏసీసీ నిర్వహించిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షాహీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులే చేసింది. అనంతరం బంగ్లాదేశ్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్..3 బంతులే ఆడి 6 పరుగులే చేసి ఆలౌటైంది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లేననే విషయం తెలిసిందే. అనంతరం పాకిస్థాన్ నాలుగు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.
ఏసీసీ ఛైర్మన్ హోదాలో ఈ టైటిల్‌ను మోహ్‌సిన్ నఖ్వీ.. పాకిస్థాన్‌కు అందజేశాడు. ఈ సందర్భంగా అతను ముసి ముసి నవ్వాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'నీ కల నెరవేరిందయ్యో.. నఖ్వీ', పురుషుల ప్రపంచకప్ ఫైనల్ గుర్తుకొచ్చిందేమోనని కామెంట్ చేస్తున్నారు.