Umran Malik: ఎక్స్‌ప్రెస్‌ను పక్కనపెట్టి తప్పు చేశారు.. ప్రపంచకప్ ఆడించి ఉంటేనా?

హైదరాబాద్: టీమిండియా యువ పేసర్, జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూపర్ బౌలర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌తో 50 ఓవర్ల ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్.. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు సందిస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.
గంటకు 153.1 కిలో మీటర్ల వేగం..
అరంగేట్ర వన్డేలో వేసిన తొలి ఓవర్ తొలి బంతికే 145.9 కి.మీ.ల వేగాన్ని అందుకున్న ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాతి బంతికి 143.3 కి.మీ, 145.6 కి.మీ, 147.3 కి.మీ, 137.1 కి.మీ, 149.6 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 153.1 వేగాన్ని కూడా అందుకున్నాడు. వరుసగా 150, 150.1 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. అతని వేగానికి న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే(24), డారిల్ మిచెల్(11) వెనుదిరిగారు. పరుగులు కూడా ఇవ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఘోర తప్పిదం..
గతంలో మాదిరిగా వేగంగా వేయడమే కాకుండా వేరియేషన్స్‌తో ఉమ్రాన్ బౌలింగ్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్, బ్యాక్ లెంగ్త్, స్లోయర్స్, యార్కర్, షాట్ పిచ్ బాల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో ఉమ్రాన్ మాలిక్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలు ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ తక్కువ అంచనా వేసిందని, అతని ప్రతిభను గుర్తించి వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రపంచకప్ ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్‌లో సెన్సేషనల్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా ఉమ్రాన్ మాలిక్ ఏం చేయగలడో రోహిత్ శర్మ అండ్ కో తెలుసుకోలేకపోయిందని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్‌కు పక్కనపెట్టి బీసీసీఐ ఘోర తప్పిదం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచకప్ ఆడించి ఉంటే..
మరికొందరూ టీమ్‌లో బంగారపు హుండీ లాంటి ప్లేయర్ ఉన్నా, అతన్ని చిల్లర వేయడానికి వాడుకున్నట్టుగా ద్వైపాక్షిక సిరీస్‌లకే పరిమితం చేశారని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌన్సీ, పేస్ పిచ్‌లు ఉమ్రాన్ బౌలింగ్ శైలికి సరిగ్గా సరిపోయేవని, ఉమ్రాన్ బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు తడబడేవారని అంచనా వేస్తున్నారు. ఉమ్రాన్ జట్టులో ఉండి ఉండే భారత జట్టు ఫలితం మరోలా ఉండేదని, ఖచ్చితంగా ఫైనల్ చేరేదని అభిప్రాయపడుతున్నారు.
మెరిసిన శ్రేయస్, సుందర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్‌మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 37 ఓవర్లలో కివీస్ 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(71 బ్యాటింగ్), టామ్ లాథమ్(67 బ్యాటింగ్) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications