IPL 2026: ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల టికెట్లను ఫ్రీగా పంచుతున్నారు!
దేశంలో ఐపీఎల్ టికెట్లకు ఉన్న క్రేజ్ దేనికి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ టికెట్ల కోసం మంత్రులు కూడా లాబీయింగ్ చేస్తుంటారు. ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక అసెంబ్లీలో చర్చనే జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ గురించి. ప్రతీ ఎమ్మెల్యేకు నాలుగు టికెట్లు ఉచితంగా ఇవ్వాలని కర్ణాటక స్పీకర్ చెప్పడంలో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాంప్లిమెంటరీ పాసుల పేరిట ప్రతీ మ్యాచ్‌కు రూ.3 కోట్ల విలువైన టికెట్లను పప్పు-బెల్లంలా పంచి పెడుతున్నారు. దాంతో ఐపీఎల్ వచ్చిందంటే కాంప్లిమెంటరీ పాసుల పేరిట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో హంగామా చోటు చేసుకుంటుంది. ఈ కాంప్లిమెంటరీ పాసుల విషయంలో హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గతంలో గొడవలు కూడా జరిగాయి.
10 శాతం టికెట్లు..
హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య ఒప్పందం ప్రకారం స్టేడియం మొత్తం సీటింగ్ సామర్థ్యంలోని పది శాతం అంటే 3500 టికెట్లు అసోసియేషన్‌కు అందుతాయి. ఇందులో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన ఆరుగురికి 50 నుంచి 70 పాసుల చొప్పున సుమారు 300-350 టికెట్లు తీసుకుంటారు. 210కి పైగా ఉన్న హెచ్‌సీఏ అనుబంధ క్లబ్‌లకు ఒక్కో క్లబ్‌కి 12 చొప్పున దాదాపు 2,520 పాసులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు మొదలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతరత్రా ప్రభుత్వ యంత్రాంగానికి మరో 500 పాసులను అందజేయం హెచ్‌సీఏకు ఆనవాయితీగా మారింది.

దాంతో ఐపీఎల్ వచ్చిందంటే హెచ్‌సీఏపై అధికార యంత్రాంగం నుంచి వచ్చే ఒత్తిడి మాములుగా ఉండదు. అయితే, ఈ పాసులను రద్దు చేసి, వీటిని కూడా టిక్కెట్ల రూపంలో విక్రయించి వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని పలువురు క్రికెటర్లు, అభిమానులు హెచ్‌సీఏను కోరుతున్నారు.
రూ. 3 కోట్లు అప్పనంగా..
ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు క్లబ్‌కు ఇచ్చే 12 టిక్కెట్ల వెల సుమారు రూ.70 వేలుగా ఉంది. అలానే హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఇచ్చే 300-350 పాసుల ధర దాదాపు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఇక 210 క్లబ్‌లకు ఇచ్చే పాసులను సాధారణ టిక్కెట్ల ధరలో చూస్తే ప్రతి మ్యాచ్‌కు రూ.కోటి 50 లక్షలు, అపెక్స్ సభ్యుల పాసుల విలువ రూ.50 లక్షలు కలిపితే రూ.2 కోట్లు.
రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ యంత్రాగానికి ఇస్తున్న పాసుల ధరల్ని జత చేస్తే ప్రతి మ్యాచ్‌కు సుమారు రూ.3 కోట్ల విలువైన టిక్కెట్లను పాసుల రూపంలో ఫ్రీగా అందజేస్తున్నారు. ఈ పాసుల కారణంగా ప్రభుత్వానికి పన్నులు, జీఎస్టీ రూపంలో ఒక్క రూపాయి కూడా రాదు. అదే సమయంలో హెచ్‌సీఏకి కూడా నయా పైసా లాభం లేదు. ఇప్పటికైనా హెచ్‌సీఏ విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఈ పాసుల సంఖ్యను కనీసం సగానికి సగం తగ్గించి, వాటిని టిక్కెట్ల రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ద్వారా విక్రయించాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. కాంప్లిమెంటరీ పాసులు ఎందుకని, రాజకీయ నాయకులకు డబ్బులు లేవా?అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాసులు ఫ్రీగా పంచి అభిమానులను మోసం చేయడమేనని, బీసీసీఐ ఈ కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications