India vs Australia రెండో టెస్ట్.. పనిచేయని హాట్‌స్టార్! అయోమయంలో ఫ్యాన్స్!

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు గట్టి షాక్ తగిలింది. ఓ వైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవ్వగా.. మరోవైపు సాంకేతిక కారణాలతో డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ యాప్ పనిచేయడం లేదు. దాంతో ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా మ్యాచ్‌ను చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ప్రారంభమవ్వగా హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేయగా.. ఎర్రర్ అని కోడ్ రావడంతో ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. సమయం గడుస్తున్నా.. యాప్ పనిచేయడంలో మార్పు లేకపోవడంతో ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్యతో..
తమకు యాప్ ఓపెన్ కావడం లేదని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. Downdetector.in సైతం ఈ విషయాన్ని నివేదించింది. వేలాదిగా యూజర్లు సైతం ఎర్రర్ స్క్రీన్ షాట్లను ట్విటర్ లో షేర్ చేస్తున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ విషయంపై స్పందించింది. యాప్‌లు మరియు వెబ్‌లో సేవలో ఊహించని సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి తమ టెక్ బృందం పని చేస్తున్నట్లు వెల్లడించింది.
ఒకేసారి లాగిన్ కావడంతో..
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎక్కువ మంది యూజర్లు ఒకే సారి లాగిన్ కావడంతోనే ఈ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. సేవలు డౌన్ కావడం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ , జైపూర్, లక్నో, కోల్ కత్తా, నాగ్ పూర్, హైదరాబాద్ , ముంబై తదితర ప్రాంతాలకు చెందిన యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. తమకు 45 నిమిషాల పాటు ఈ సమస్య తలెత్తిందని కొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ఆస్ట్రేలియా అదే తడబాటు..
ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 168 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(125 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 81) ఒక్కడే రాణించగా.. డేవిడ్ వార్నర్(15), మార్నస్ లబుషేన్(18), స్టీవ్ స్మిత్(0), ట్రావిస్ హెడ్ (12), అలెక్స్ క్యారీ(0) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(23 బ్యాటింగ్)తో పాటు పీటర్ హ్యాండ్‌స్కోంబ్(36 బ్యాటింగ్) ఉన్నారు. రెండో సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 199 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications