
హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై భారత్ అదరగొట్టింది. అద్భుత విజయంతో సుదీర్ఘ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20 హై స్కోరింగ్ మ్యాచ్‌లో 6 వికెట్లతో గెలుపొందింది.
న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ గాయంతో మళ్లీ ఓపెనర్‌గా అవతారమెత్తిన కేఎల్ రాహుల్ (56) సూపర్ ఫిఫ్టీతో చెలరేగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (45)తో కలిసి విజయానికి బాటలు వేసాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించింది. చివర్లో యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (58 నాటౌట్) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో కోహ్లీ సేన సునాయస విజయాన్నందుకుంది.
అయితే కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి నెటిజన్లు ఒక ఆటఆడుకుంటున్నారు. తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పనిచెబుతూ ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ గాయపడటంతో అనూహ్యంగా వికెట్ కీపింగ్ బాధ్యతలుఅందుకున్న రాహుల్ రఫ్ఫాడిస్తున్నాడు. అటు బ్యాటింగ్.. ఇటు కీపింగ్‌లో దూసుకుపోతున్నాడు.
ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ సైతం స్పెషలిస్ట్ కీపర్ అయిన పంత్‌ను పక్కనపెట్టి రాహుల్‌కే కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాడు. అతను కూడా కెప్టెన్ నమ్మకం కోల్పోకుండా అదరగొట్టాడు. దీంతో పంత్ అవసరం జట్టుకు లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తట్టా బుట్టా సర్థుకోమనే అర్థంతో మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా జోకులు పేల్చుతున్నారు. అతని నిలకడైన పెర్ఫామెన్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.