World Cup 2023: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దుమ్మురేపుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో రెండు మ్యాచ్‌లే ఆడిన షమీ.. 9 వికెట్లతో సత్తా చాటాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ వెటరన్ పేసర్.. అవకాశం వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నాడు.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమవడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న షమీ.. న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో అదే జోరును కొనసాగించాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై నిప్పులు చెరిగిన షమీ.. ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.

అతని బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు శక్తిని మించిన పనే అయింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్‌ను ఔట్ చేసిన తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఔట్ స్వింగర్స్‌తో ఇబ్బంది పెట్టిన షమీ.. అనూహ్యంగా బంతిని టర్న్ చేసి స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతికి బిత్తరపోయిన స్టోక్స్.. ఏం జరిగిందో అర్థం కానట్లుగా చూస్తూ వెళ్లిపోయాడు.
మొయిన్ అలీని ఔట్ చేసిన బంతి కూడా షమీ ప్రత్యేకతను చాటేదే. వేగం, కచ్చితత్వంతో తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి చాటిన షమీ.. భారత బౌలింగ్ విభాగానికి తిరుగులేని బలాన్నిచ్చాడు. తన ఆటతో తుది జట్టులో నుంచి పక్కనపెట్టలేని పరిస్థితిని కల్పించాడు. షమీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. తన ఆటపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడ్డాడు.
సతీమణి హసీన్ జహాన్ పెట్టిన తప్పుడు కేసులు, అసత్య ఆరోపణలతో ఎంతో మానసిక క్షోభను అనుభవించిన షమీ.. ఏ మాత్రం కుంగిపోకుండా భారత్ తరఫున సత్తా చాటుతున్న తీరు స్పూర్తి దాయకం. కట్టుకున్న భార్య.. కన బిడ్డ దూరమైనా.. ఫిక్సర్, స్త్రీలోలుడు, ఫ్రాడ్ అంటూ సంచలన ఆరోపణలను ఎదుర్కొన్న షమీ.. వీటన్నికి తన ఆటతోనే బదులిచ్చాడు.
పెళ్లాం దూరమైందని, టార్చర్ పెడుతుందని ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో ఓ అంతర్జాతీయ క్రికెటర్‌గా తన సమస్యలను అధిగమించి ప్రపంచకప్ 2023లో తన అవకాశం కోసం ఎదురు చూసి సత్తా చాటడం అద్భుతమని నెటిజన్లు కొనియాడుతున్నారు. పెళ్లాం టార్చర్‌ను తట్టుకొని నిలబడిన షమీ.. చాలా గొప్పోడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.