ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ బాది ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యాతో కలిసి ఆదుకున్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న తిలక్ వర్మ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మరో 12 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ 12 బంతుల్లో తిలక్ వర్మ 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదాడు.
అయితే స్ట్రాటజిక్ టైమ్ ఔట్ వరకు స్లోగా ఆడిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఒక్కసారిగా టాప్ గేర్‌లో బ్యాటింగ్ చేశాడు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో హార్దిక్ పాండ్యా గట్టిగా అరుస్తూ తిలక్ వర్మకు ఏదో చెప్పాడు. తనదైన మాటలతో తిలక్ వర్మను రెచ్చగొట్టాడు. ఈ సంభాషణ ఏంటనేది తెలియకున్నా.. ఈ సన్నివేశాన్ని బ్రాడ్‌కాస్టర్స్ పదే పదే చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
' ఏం నూరిపోసావు రా అయ్యా.. కుక్కను కొట్టినట్లే కొట్టాడు'అని ఒకరంటే.. తిలక్ వర్మను హార్దిక్ పాండ్యా తన మాటలతో ఉసిగొల్పాడని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు ఈ సంభాషణకు తమ సొంత వ్యాఖ్యలు రాసుకొచ్చారు. 'తిలక్.. ఈ స్లో బ్యాటింగ్ ఏంది రా భాయ్. కొడితే బంతి బయట పడాలి. నువ్వు కొట్టగలవు. దంచికొట్టు.. నేనున్నా'అని హార్దిక్ నూరిపోసాడని కామెంట్స్ చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ.. ఆ తర్వాతి ఓవర్‌లోనే తిలక్ వర్మ ఉగ్రరూపం చూపించాడు. అశోక్ వర్మ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా ఐదు బంతులను 6, 4, 4, 6, 6 బౌండరీలకు తలించి 26 పరుగులు పిండుకున్నాడు. ఈ విధ్వంసం మ్యాచ్‌నే మలుపు తిప్పింది.
తిలక్ వర్మ ఊచకోతతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తిలక్ ధాటికి ముంబై 199 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ 100 పరుగులకే ఆలౌటైంది. కనీసం తిలక్ వర్మ చేసిన 101 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ విజయానంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లో తిలక్ వర్మతో మాట్లాడిన సంభాషణ గురించి తెలియజేశాడు. బంతిని చూసి మాత్రమే బాదాలని చెప్పానని పేర్కొన్నాడు.
'తిలక్ లాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. నేను అతనికి ఒకటే చెప్పాను.. 'బంతిని చూడు, బాదు.. అంతే'. అతని బ్యాట్ నుంచి వచ్చే స్ట్రోక్స్ చాలా స్పెషల్. అతను ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే సమయం ఎప్పుడో వచ్చేసింది. నేను మైదానంలో ఎంత గట్టిగా అరిచానంటే.. నాకు కళ్లు తిరిగినంత పని అయింది. ఈ ఎనర్జీ తిలక్ వర్మతో పాటు ముంబై ఇండియన్స్‌కు చాలా అవసరం.’అని హార్దిక్ తెలిపాడు.