నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్
ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. తొలుత 3.3 ఓవర్లకు 34 పరుగులు ఇచ్చిన ఎల్లిస్.. చివరి మూడు బంతుల్లో మహ్మదుల్లా(53 బంతుల్లో 4 ఫోర్లతో 52), ముస్తాఫిజుర్(0), మెహ్‌ది హసన్(6)లను పెవిలియన్ చేర్చి అరుదైన ఫీట్ సాధించాడు. ముందుగా హాఫ్ సెంచరీ సాధించిన మహ్మదుల్లాను క్లీన్ బౌల్డ్ చేసిన ఎల్లిస్.. ఆ తర్వాత ముస్తాఫిజుర్‌ను , మెహ్‌దీ హసన్‌లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
చేతులెత్తేసిన ఆసీస్..
అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు మాత్రమే చేసింది. మెక్ డెర్మట్ (41 బంతుల్లో 35 పరుగులు), మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 51 పరుగులు) ఆడినప్పటికీ.. వీరి ఇన్నింగ్స్ టెస్టులను తలపించింది. చివర్లో డానియల్ క్రిస్టియన్ క్రీజులో ఉన్నా ఆకట్టుకోలేకపోయాడు. స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వికెట్లేమీ తీయకున్నా.. 4 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చాడు. ఇస్లాం 2.. షకీబుల్, నసుం అహ్మద్ తలో వికెట్ తీశారు.
ముంచేసిన ముస్తాఫిజుర్..
ముఖ్యంగా ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ ఆస్ట్రేలియా పతనాన్ని శాసించింది. చివరి రెండు ఓవర్లలో ఆసీస్ విజయానికి 23 రన్స్ కావాలి. టీ20ల్లో ఇదేం కష్టం కాదు. పైగా క్రీజులో ఆసీస్ ప్రధాన బ్యాట్స్‌మన్ కూడా ఉన్నారు. దాంతో ఆసీస్ విజయం ఖాయమని భావించారు. కానీ బంతిని అందుకున్న ఫిజ్(ముస్తాఫిజర్) అద్భుతం చేశాడు. తనదైన యార్కర్లతో 6 బంతుల్లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. ఫిజ్ కట్టుదిట్టమైన బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మన్ డానియల్ క్రిస్టియన్ తెల్లమొహం వేసాడు. తొలి రెండు బంతుల్లో అలెక్స్ క్యారీ ఒక పరుగు తీయగా.. మిగతా నాలుగు బంతుల్లో క్రిస్టియన్ దారుణంగా తడబడ్డాడు. దాంతో ఆసీస్ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. మెహ్‌ది హసన్ వేసిన ఆ ఓవర్‌లో క్యారీ సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది.
అంబరాన్నంటిన సంబరాలు..
విజయానంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విజయంతో వారి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. గెలిచిన సంబురం మైదానంలో ఆటగాళ్లంతా చిందులేశారు. ఇక అద్భుత ప్రదర్శన కనబర్చిన బంగ్లాదేశ్ జట్టుపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తుంది. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆ జట్టును కొనియాడుతున్నారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ బౌలింగ్‌ను ప్రశంసిస్తున్నారు. అదే విధంగా బంగ్లాను తక్కువ అంచనా వేసిన ఆసీస్ మూల్యం చెల్లించుకుందని చురకలంటిస్తున్నారు. బంగ్లాదేశ్ పసికూనగా పరిగణించిన ఆసీస్ తమ సీనియర్ ఆటగాళ్లు లేకుండా ద్వితీయ శ్రేణి జట్టుతో బంగ్లా పర్యటనకు వచ్చిందని, వారు దిమ్మతిరిగే బదులిచ్చారని కామెంట్ చేస్తున్నారు.
మెచ్చుకుంటున్న మాజీ క్రికెటర్లు..
బంగ్లాదేశ్ విజయం ప్రతీ క్రికెట్ అభిమానికి సంతోషం కలిగిస్తుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై తొలి సిరీస్ నెగ్గిన బంగ్లాదేశ్‌కు అభినందనలు. ముస్తాఫిజుర్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రతీ క్రికెట్ అభిమానికి ఈ విజయం సంతోషాన్ని ఇస్తుంది'అని వీవీఎస్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నర్ ముస్తాఫిజర్ అని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. 'ఆస్ట్రేలియాపై తొలి సిరీస్ నెగ్గిన బంగ్లా పులులకు అభినందనలు. ముస్తాఫిజుర్ 4-0-9-0 బౌలింగ్ అద్భుతం. 19వ ఓవర్‌లో ఒకే పరుగు ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు'అని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ మాజీ ఆటగాళ్లు సైతం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ముష్ఫికర్ రహీమ్, తమీమ్ ఇక్బాల్ ఖాన్ బంగ్లా విజయాన్ని కొనియాడారు.

బంగ్లా పులులకు కొత్తేం కాదు..
ఇక బంగ్లాదేశ్‌కు సంచలన విజయాలను అందుకోవడం కొత్తేం కాదు. గతంలోను అనేక పెద్ద జట్లను ఆ జట్టు మట్టికరిపించింది. న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, భారత్, శ్రీలంకలను ఓడించిన ఆ జట్టు తాజాగా ఆస్ట్రేలియాకు కూడా షాకిచ్చింది. 2015 నుంచి ఆ జట్టు ఆట మెరుగ్గా ఉంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల సిరీస్‌లో అదరగొడుతుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికా(2015), న్యూజిలాండ్(2010), భారత్(2015), పాకిస్థాన్(2015), శ్రీలంక(2021)లపై సిరీస్ విజయాలనందుకుంది. లోటుగా ఉన్న ఆస్ట్రేలియా పని కూడా పట్టేసింది. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాపై సాధించిన ఈ విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications












