
న్యూఢిల్లీ: భారత్-వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ముగిసి మూడు రోజుల అవుతోంది. కానీ ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు తెలుగు ఆల్‌టైమ్ హిట్ మూవీ పుష్ప సినిమాకు సంబంధించిన పాటకు అభిమానులు చిందేసారు. సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత నర్తించిన ఐటెం సాంగ్ 'ఊ అంటావా మామ ఊ అంటావా'అంటూ ఫ్యాన్స్ ఊగేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా అన్ని భాషల అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని తగ్గేదేలే మ్యానరిజం వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ ఇలా అన్ని గేమ్‌ల్లో ఆటగాళ్లు తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమా రీలీజ్ తర్వాత మూడు నెలలపాటు యావత్ ప్రపంచం పుష్పా మానియాలో మునిగి తేలింది.
ఇక వెస్టిండీస్ పర్యటనను భారత్ ఘనంగా ముగించింది. ఆఖరి టీ20లో 88 పరుగులతో ఘన విజయాన్నందుకొని 5 టీ20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్‌ను హెట్‌మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నా ఫలితం లేకపోయింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న టీమిండియా 18 నుంచి ద్వితీయ శ్రేణి జట్టుతో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్‌తో మళ్లీ సీనియర్ ఆటగాళ్లంతా బరిలోకి దిగనున్నారు.