ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టును మరోసారి భారత్ చిత్తు చేసింది. ఆదివారం ఏకపక్షంగానే సాగిన సూపర్-4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించి మూల్యం చెల్లించుకున్నారు. భారత ఆటగాళ్లతో అకారణంగా గొడవకు దిగారు. భారత అభిమానులనూ రెచ్చగొట్టారు.
మ్యాచ్ ఆరంభం నుంచే పాకిస్థాన్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. తొలి ఓవర్‌లోనే పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హామ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఆ సమయంలో పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లోని పాక్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ మరో రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడం.. పాక్ బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఫర్హామ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు కొట్టినప్పుడు తమకు తిరుగులేదన్నట్లు బిల్డప్ ఇచ్చారు. అభిషేక్ శర్మ ఇగోను హర్ట్ చేశారు.

భారత బ్యాటింగ్ సందర్భంగా అభిషేక్ శర్మ.. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి బంతినే సిక్సర్‌గా తరలించిన అభిషేక్ ఆ తర్వాత పాక్ బౌలర్లను వరుస బెట్టి చితక్కొట్టాడు. హరీస్ రౌఫ్ నోటికి పనిచెప్పడంతో అదే రీతిలో బదులిచ్చాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది మ్యాచ్‌ను పాక్ నుంచి లాగేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ ఇదే విషయాన్ని వెల్లడించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు అకారణంగా తనను రెచ్చగొట్టారని, దాంతోనే తాను దూకుడుగా ఆడానని బదులిచ్చాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాకిస్థాన్ అతిని తిప్పికొట్టాడు. గణంకాలు చూసైనా పాకిస్థాన్ తమకు ప్రత్యర్థి అని అనొద్దని మీడియాను కోరాడు. తమకు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల అతిపై భారత అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనని, పాకిస్థాన్ ఆటగాళ్లకు బాగా అలవాటని మండిపడుతున్నారు.