
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నటించిన ఓ వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లు మైదానంలో ఆటగాడిగా, కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, మెంటార్‌గా అభిమానులను అలరించిన మహీ ఇప్పుడు నటుడిగా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న ధోనీ... తన అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు.
'అథర్వ ది ఆరిజిన్' పేరిట సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే నవల ఆధారంగా.. అదే పేరుతో గ్రాఫిక్స్ రూపంలో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ ఓ యోధుడి పాత్రలో నడిపిస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. ఈ వీడియోలో మహేంద్ర సింగ్ ధోనీ రెండు చేతుల్లో కత్తులను పట్టుకొని రాక్షసుల గుంపును సంహరిస్తున్నట్లు కనిపించాడు.
ఈ వీడియోను ధోనీనే తన ఫేస్‌బుక్ వేదికగా పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. రమేశ్ తమిల్‌మని అనే కొత్త రచయిత ఈ కథను సిద్ధం చేశారు. కాగా, దీనికి ధోనీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణ సంస్థ సహకారం అందిస్తుండటం గమనార్హం. ఈ ఫస్ట్ లుక్‌పై అభిమానులు ఫిదా అవుతున్నారు. ధోనీ లుక్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. హరహర మహదేవ అంటూ ధోనీని కొనియాడుతున్నారు.
ఇక 2016లో ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ' బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం అందరి మనస్సులను హత్తుకుంది. ఇప్పుడు ధోనీనే స్వయంగా నటించిన సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.