IPL 2022: మ్యాచ్‌లు ఎందుకు దండుగా.. ముంబైకే టైటిల్ ఇవ్వండి! టోర్నీ విధానంపై పేలుతున్న సెటైర్లు!

హైదరాబాద్: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల రాకతో టోర్నీ ఫార్మాటే మారిపోయింది. దాంతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్‌లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్‌లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్‌లే ఆడనుండగా, ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్‌లు అని చెబుతున్నా... కరోనా కారణంగా టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో 'సొంత మైదానం' అనే ప్రభావం లేకుండా పోయింది. మొత్తం లీగ్ మ్యాచ్‌ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహించనున్నారు. అయితే ఈ నయా ఫార్మాట్‌పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టైటిల్స్ ఆధారంగా..
ఐపీఎల్‌లో ఇంతకు ముందు ప్రదర్శనల ఆధారంగా పది జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీశారు. గెలిచిన టైటిల్స్, ఫైనల్ చేరిన సందర్భాలను బట్టి ప్రతీ టీమ్‌కు ర్యాంక్ ఇచ్చారు. గ్రూప్‌ఏలో వరుసగా ముంబై ఇండియన్స్(5 టైటిల్స్), కేకేఆర్(2), రాజస్థాన్ (1టైటిల్), ఢిల్లీ(ఒకసారి ఫైనల్), లక్నోలను చేర్చారు. గ్రూప్ బిలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్(4 టైటిల్స్), హైదరాబాద్(1 టైటిల్), బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌ను ఉంచారు.
ప్రతీజట్టు రెండేసి మ్యాచ్‌లు..
ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో (గ్రూప్‌లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్‌లు అవుతాయి. మరో గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్‌లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ 'ఎ' గ్రూప్‌లోని నాలుగు టీమ్‌లతో పాటు గ్రూప్ 'బి'లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
ముంబైలోనే మ్యాచ్‌లు..
70 లీగ్ మ్యాచ్‌లలో 20 మ్యాచ్‌లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్‌లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే అన్ని మ్యాచ్‌లను ముంబైలో నిర్వహించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్త ఫార్మాట్ గందరగోళంగా ఉందని, కొంచెం కూడా అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఈ ఫార్మాట్ అర్థం చేసుకోవడానికి రెండేళ్లు పడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్ వేదికగా ఐపీఎల్ నయా ఫార్మాట్‌పై మీమ్స్, ట్రోల్స్ పేలుతున్నాయి.
టైటిల్ ముంబైకి ఇచ్చేయండి..
మ్యాచ్‌లన్నీ ముంబైలో నిర్వహించడం వల్ల ముంబై ఇండియన్స్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు సైతం బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లుగా ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్‌లు నిర్వహించే బదులు.. నేరుగా ముంబై ఇండియన్స్‌కు టైటిల్ ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఒకే వేదికలో మ్యాచ్‌లు నిర్వహించాల్సి అవసరం ఏముందని నిలదీస్తున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారని, మ్యాచ్‌లు ఒకప్పటిలానే దేశం మొత్తం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications