సొంతగడ్డపై టీమిండియాకు మరో ఘోర పరాజయం ఎదురైంది. మూడేళ్ల తర్వాత భారత జట్టు స్వదేశంలో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. బంతితో తేలిపోయి, బ్యాటుతో తడబడిన భారత్.. మూడో వన్డేలో న్యూజిలాండ్ ఆధిపత్యానికి తలంచింది. మరోవైపు డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్ సూపర్ శతకాలతో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి.
విరాట్ కోహ్లీ విరోచిత శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, యువ పేసర్ హర్షిత్ రాణా అత్యుత్సాహం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కకపోగా.. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) తీవ్రంగా నిరాశపర్చడంతో భారత్ 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. నితీష్ క్రీజులో సెట్ అయిన తర్వాత దూకుడుగా ఆడాలని మేనేజ్‌మెంట్ అతనికి సూచించింది. దాంతో నితీష్ బ్యాట్‌కు పనిచెప్పాడు. రెండు భారీ సిక్స్‌లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భాగస్వామ్యం కూడా 88 పరుగులకు చేరడంతో టీమిండియాకు తిరుగులేదని అనుకున్నారు. మరోవైపు నితీష్ తగ్గేదేలే అంటూ తన హాఫ్ సెలెబ్రేట్ చేసుకున్నాడు. కానీ క్లార్క్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇది భారత్‌ను దెబ్బతీసింది. కోహ్లీతో కలిసి నితీష్ మరో 50 పరుగులు జోడించినా ఫలితం మరోలా ఉండేది.
నితీష్ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్ రాణా అద్భుతమైన షాట్లతో అలరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారీ సిక్స్‌లు బాది కోహ్లీపై ఒత్తిడి తగ్గించాడు. రాణా సర్‌ప్రైజ్ బ్యాటింగ్ టీమిండియా శిభిరంలో ఆశలు రేకెత్తించింది. ఫోక్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది 41 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న రాణా.. దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అతని హాఫ్ సెంచరీని డగౌట్ నుంచి అభినందించిన గంభీర్.. ఇంకా మ్యాచ్ అయిపోలేదని, ప్రశాంతంగా ఆడాలని సూచించాడు. మరోవైపు కోహ్లీ కూడా రాణాను శాంతపర్చే ప్రయత్నం చేశాడు.
తనకు అండగా నిలవాలని, మ్యాచ్‌ను నేను చూసుకుంటానని చెప్పాడు. కానీ వారి మాటను పట్టించుకోని నితీష్ రాణా.. ఫుల్ టాస్ బాల్‌ను అత్యుత్సాహంతో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఏడో వికెట్‌కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హర్షిత్ రాణా కాస్త నెమ్మదించి.. కోహ్లీ అండగా నిలిచి ఉంటే టీమిండియా గెలిచేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యం భారత్‌ను కష్టాల్లోకి నెట్టితే.. క్రీజులో సెట్ అయిన నితీష్, హర్షిత్ అత్యుత్సాహం జట్టు విజయవకాశాలను దెబ్బతీసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.