ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. మెగా టోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడోసారి టైటిల్ నెగ్గి తీన్‌మార్ కొట్టింది. విశ్వవేదికపై మువ్వెన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠపోరులో అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ టోర్నీలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
టీమిండియా కాపరిలా.. ఆరంభానికి ముగింపు మధ్య వారధిలా అయ్యర్ చెలరేగాడు. తన లోపాన్ని బలంగా మార్చుకొని, పడిపోతున్న ప్రతీసారి తాను ఉన్నానని నమ్మకాన్ని కలిగించాడు. ఈ టోర్నీలో వికెట్లు పడిన ప్రతీసారి తానే బాధ్యత తీసుకొని ఆడాడు. రెండు హాఫ్ సెంచరీలు, రెండు 40+ స్కోర్లతో పరుగులు చేశాడు. భారత్ తరఫున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

రాయుడిని ఆడిస్తే..
అతని అసాధారణ ప్రదర్శనతో వన్డేల్లో నాలుగో బ్యాటర్ ఎంత కీలకమో తెలియజేశాడు. ఈ విజయం నేపథ్యంలో భారత అభిమానులు మరోసారి తెలుగు తేజం అంబటి రాయుడిని గుర్తు చేసుకుంటున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో అంబటి రాయుడిని జట్టులోకి తీసుకొని ఉంటే ఆ టోర్నీలో కూడా టీమిండియా విజేతగా నిలిచేదని కామెంట్ చేస్తున్నారు. అంబటి రాయుడిని కాదని త్రీడీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌ను తీసుకోవడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ నిర్ణయంపై రాయుడు బాహటంగానే విమర్శలు గుప్పించాడు. ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ చేసిన ఆ తప్పిదం టీమిండియాను టైటిల్ గెలవకుండా చేసింది. కానీ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ ఆ తప్పు చేయలేదు. నాలుగో బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ సరైనవాడని భావించి ఎంపిక చేశారు. ఆరంభంలో తుది జట్టులో అవకాశం ఇవ్వకపోయినా.. అనూహ్యంగా వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవడంతో అతన్నే కొనసాగించారు. టీమిండియా మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అయ్యర్.. అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజంలోకీలక పాత్ర పోషించాడు.

నాలుగో నెంబర్ బ్యాటర్..
అంబటి రాయుడు సైతం జట్టు నాలుగో బ్యాటర్ విలువ ఏంటో అయ్యర్ తెలియజేశాడని పేర్కొన్నాడు. 'శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన జట్టులో నాలుగో నెంబర్ బ్యాటర్ అవసరం ఏంటో తెలియజేస్తోంది. టాపార్డర్ విఫలమైనప్పుడు శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు కఠినంగా మారిన వికెట్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
వన్డేల్లో నాలుగో, ఐదో స్థానంలో ఆడే బ్యాటర్లు చాలా కీలకం. శ్రేయస్ అయ్యర్.. అక్షర్ పటేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. నాలుగో స్థానంలో అయ్యర్ ఛాంపియన్ బ్యాటర్. కానీ అతని గురించి మనం ఎవరం ఎక్కువగా మాట్లాడం. కానీ టీమిండియాపై అతను తీవ్ర ప్రభావం చూపాడు.'అని రాయుడు పేర్కొన్నాడు.