తనపై వచ్చిన విమర్శలకు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం ఉందని మాజీ క్రికెట్లు చేసిన వ్యాఖ్యలకు శతకంతో బదులిచ్చాడు. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 127 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
గస్ అట్కిన్సన్ వేసిన 51 ఓవర్ రెండో బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. జైస్వాల్‌కు ఇది 6వ టెస్ట్ సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌పై నాలుగోది. ఈ సెంచరీని యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు. గ్యాలరీ వైపు చూస్తూ ముద్దుల వర్షం కురిపించాడు. లవ్ సింబల్ చూపించాడు. గతంలోనూ ఈ తరహాలో జైస్వాల్ సెలెబ్రేట్ చేసుకున్నప్పటికీ.. ఈ సారి లవ్ సింబల్ చూపించడం చర్చనీయాంశమైంది.
యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా.. మ్యాచ్‌కు హాజరైందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎవర్ని ఉద్దేశించి జైస్వాల్ ఈ సంబరాలు చేసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. జైస్వాల్ ఏదో ప్రేమ కథ నడిపిస్తున్నాడని మరికొందరు కామెంట్ చేశారు. అయితే పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అనంతరం కూడా ఇదే తరహాలో జైస్వాల్ సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న అర్థాన్ని జైస్వాల్ మీడియాతో పంచుకున్నాడు. తన శ్రేయోభిలాషులు, అభిమానులు, కుటుంబ సభ్యుల మద్దతుకు కృతజ్ఞతగా వారికి ముద్దులు ఇస్తానని తెలిపాడు.

ఈ సిరీస్‌ను భారీ శతకంతో ప్రారంభించిన జైస్వాల్ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. తర్వాత ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో(101, 4, 87, 28, 13, 0, 58, 0, 2) హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. దాంతో అతనిపై విమర్శలు వచ్చాయి. జైస్వాల్ ఫామ్ కోల్పోయాడనే చర్చ కూడా జరిగింది. కానీ తాజా ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది జైస్వాల్ ఈ సందేహాలకు సమాధానమిచ్చాడు.
జైస్వాల్ శతకంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 75/2 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు యశస్వి జైస్వాల్‌తో పాటు నైట్‌వాచ్‌మన్ ఆకాష్ దీప్(66) అదిరిపోయే భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఆకాష్ దీప్‌ను ఓవర్టన్ ఔట్ చేయగా.. శుభ్‌మన్ గిల్(11), కరుణ్ నాయర్(17)లను అట్కిన్సన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది.