దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇవ్వడంపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఆటగాళ్లందరికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. టీమిండియా కెప్టెన్ అయినా.. జాతీయ జట్టుకు దూరంగా ఉండి ఫిట్‌గా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.
తమ ఆదేశాలను బేఖాతరు చేసిన టీమిండియా యువ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై క్రమ శిక్షణ చర్యలు కూడా తీసుకుంది. రంజీ ట్రోఫీ ఆడకుండా ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రిపేర్ అవ్వడాన్ని తప్పుబట్టింది. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ల నుంచి ఈ ఇద్దరి ఆటగాళ్లను తొలగించింది. గతేడాది బీ గ్రేడ్ కాంట్రాక్ట్ అందుకున్న శ్రేయస్ అయ్యర్, సీ గ్రేడ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌లు.. ఈ సారి ఎలాంటి కాంట్రాక్ట్ అందుకోలేకపోయారు.

ఈ చర్యలతో ఆటగాళ్లందరికి ఓ హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోని ఆటగాళ్లను జాతీయ జట్టు ఎంపికలోకి పరిగణలోకి తీసుకోమని కూడా పేర్కొంది.
టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ప్రోత్సహకాలు ప్రకటించింది. ఒక ఏడాదిలో టీమిండియా ఆడే మ్యాచ్‌ల్లో సగం కంటే ఎక్కువ ఆడితే ఒక్కో టెస్ట్ చొప్పున రూ. 30 లక్షలు, 70 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే రూ. 40 లక్షలు ఇన్‌సెంటీవ్‌గా అందిస్తామని తెలిపింది. తుది జట్టులో లేకుండా జట్టుతోనే ఉంటే రూ. 15, రూ. 20 లక్షలు ఇస్తామని పేర్కొంది.
అయితే ఇక్కడ ఆటగాళ్ల కంటే బీసీసీఐ, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంటే దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావించారు. ఈ ఇద్దరే కాదు దేశంలో ఉన్న క్రికెటర్లంతా ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి రావాలనుకుంటున్నారు.
సెలెక్టర్లు సైతం దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్ల కంటే ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, జితేశ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులోకి వచ్చారు.

ముస్తాక్ అలీ ట్రోఫీలో వీళ్లంతా ఆడినా.. మెరుగైన ప్రదర్శన చేసినా రాని గుర్తింపు ఐపీఎల్‌తో వచ్చింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లంతా దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి అంబటి రాయుడిని తీసేయం.. 2021 టీ20 ప్రపంచకప్‌కు చాహల్ స్థానంలో వరుణ్ చక్రవర్తీని ఎంపిక చేయడం.. 2022 టీ20 ప్రపంచకప్‌కు దీపక్ హుడాను తీసుకోవడం వంటి నిర్ణయాలన్నీ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే తీసుకున్నారు.
సెలెక్టర్లు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా కాకుండా దేశవాళీ టోర్నీల ప్రదర్శన ప్రకారం జట్టును ఎంపిక చేస్తే కుర్రాళ్లంతా ఆ టోర్నీల వైపే మొగ్గు చూపుతారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.