సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ అభిమానులకు షాకిచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం లేదని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను ఫాఫ్ డుప్లెసిస్ పంచుకున్నాడు. ఇది వీడ్కోలు కాదని తన ప్రకటనలో స్పష్టం చేశాడు.
'14 సీజన్ల తర్వాత, ఈ ఏడాది ఐపీఎల్ వేలం బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాను. ఈ లీగ్ నా కెరీర్‌లోనే ఒక పెద్ద భాగం. ప్రపంచ స్థాయి సహచరులతో.. అద్భుతమైన ఫ్రాంచైజీల కోసం, అంకితభావంతో కూడిన అభిమానులు ముందు ఆడటం నాకు దక్కిన అదృష్టం. భారత్ నాకు మంచి స్నేహాలను, మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది.

భారత్‌కు నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది వీడ్కోలు కాదు.. మళ్లీ కలుస్తాను. మీరు నన్ను మళ్లీ చూస్తారు. ఏడాది ఓ కొత్త ఛాలెంజ్‌ను స్వీకరించాలని నిర్ణయించుకున్నా. అప్‌కమింగ్ పీఎస్‌ఎల్ సీజన్‌లో బరిలోకి దిగుతున్నా. కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త సవాల్. పాకిస్థాన్ ఆతిథ్యం కోసం ఎదురుచూస్తున్నా.' అని ఫాఫ్ డుప్లెసిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
గత 14 సీజన్లలో ఫాప్ డుప్లెసిస్.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. ఇందులో సుదీర్ఘ కాలం చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
2013లో చెన్నై తరఫున బరిలోకి డుప్లెసిస్.. సీఎస్‌కేపై నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున 2016, 2017 సీజన్లు ఆడాడు. ఆ తర్వాత 2018 నుంచి 2021 వరకు సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించాడు. 2021లో సీఎస్‌కే టైటిల్ గెలవడంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. 633 పరుగులతో రాణించాడు.
2022 మెగా వేలానికి ముందు సీఎస్‌కే వదిలేయగా.. ఆర్‌సీబీ కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2024 వరకు ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగిన ఫాఫ్ డుప్లెసిస్ గత సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అక్షర్ పటేల్‌కు డిప్యూటీగా వ్యవహరించాడు. అయితే ఆశించిన రీతిలో రాణించకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని ఈసారి వదిలేసింది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా నిలుస్తానని భయమో లేక.. మినీ వేలంలోకి వదిలేయడాన్ని అవమానంగా భావించాడో తెలియదు కానీ ఈసారి ఐపీఎల్‌కు డుప్లెసిస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో డుప్లెసిస్ 9 మ్యాచ్‌లు ఆడి 202 పరుగులే చేశాడు. ఓవరాల్‌గా154 మ్యాచ్‌లు ఆడిన ఫాఫ్ డుప్లెసిస్ 4773 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.