బ్యాటింగ్‌లో 20 పరుగులు తక్కువగా చేయడంతోనే విజయం సాధించలేకపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. బ్యాటింగ్ వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఇంపాక్ట్ రూల్ కారణంగా భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని ఫాఫ్ డుప్లెసిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరో 20 పరుగులు చేసుంటే..
'డ్యూ ప్రభావం ఉన్నప్పుడు అదనంగా పరుగులు చేయాలి. కానీ మేం మా లక్ష్యానికి 20 పరుగులు తక్కువగా చేశాం. అయినా మా కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారు. గెలుపు కోసం ఆఖరి వరకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. ఎవరిని అడిగినా.. ఈ పిచ్ కండిషన్స్, సహజ స్వభావం నేపథ్యంలో 180 పరుగుల లక్ష్యం పోరాడదగినదనే చెబుతారు.
కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరస్థితి నెలకొంది. డ్యూ కూడా మ్యాచ్ ఫలితాలను శాసిస్తోంది. ఈ సీజన్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. చాలా టీమ్స్ అగ్రస్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాయి. కానీ మేం అద్భుతంగా పుంజుకున్నాం. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి అసాధారణ పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరాం.
అయితే ఈ రోజు మేం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. బ్యాటింగ్‌లో 20 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేది.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
చెలరేగిన అశ్విన్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు.
రాణించిన పరాగ్, హెట్‌మైర్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్ పరాగ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), షిమ్రాన్ హెట్‌మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సత్తా చాటారు. చివర్లో రోవ్‌మన్ పోవెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/33) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.ఈ గెలుపుతో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.