బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరే అర్హత తమ జట్టుకు లేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. జట్టులో ఇద్దరు, ముగ్గురు తప్పా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారని తెలిపాడు. ముఖ్యంగా 5, 6, 7 స్థానాల్లో ఆడే బ్యాటర్ల వైఫల్యం టీమ్ విజయవకాశాలను దెబ్బ తీసిందన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో టోర్నీ నుంచి ఆర్‌సీబీ నిష్క్రమించగా.. ముంబై ఇండియన్స్ ముందడుగు వేసింది. మ్యాచ్ అనంతరం తమ టీమ్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్.. దినేశ్ కార్తీక్ వైఫల్యం టీమ్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.

మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయకపోవడం, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతోపాటు ఫినిషింగ్ టచ్ ఇచ్చే బిగ్ హిట్టర్లు లేకపోవడంతో లీగ్ స్టేజ్‌లోనే టోర్నీని ముగించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ' గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసింది. మేం బలమైన జట్టుతో బరిలోకి దిగాం. కానీ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో మా పతనాన్ని శాసించాడు.
ముందు ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లోనే తేమ కారణంగా తడి ఎక్కువైంది. దీంతో బంతిపై కావాల్సినంత పట్టు చిక్కలేదు. మ్యాచ్‌లో మేం పైచేయి సాధించడానికి వీలుగా విరాట్ కోహ్లీ అసాధారణ ఆటతీరును కనబర్చాడు. కానీ, శుభ్‌మన్ గిల్ అసాధారణ రీతిలో ఆడి మ్యాచ్‌ను లాగేసాడు.
బ్యాటింగ్‌లో టాప్-4 ఆటగాళ్లు బాగా ఆడారు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించ లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో మేం అనుకున్న విధంగా వికెట్లు కూడా తీయలేకపోయాం. సీజన్ ఆసాంతం నాతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు.
డెత్ ఓవర్లలో మా జట్టు ఆటతీరు మెరుగుపడాలి. గత సంవత్సరం దినేశ్ కార్తిక్ మంచి ఫామ్‌లో ఉండి తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కానీ, ఈ సీజన్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. సక్సెస్ అయిన జట్లను పరిశీలిస్తే వారికి ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో మంచి హిట్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్లేఆఫ్స్ చేరిన జట్లలా రాణించలేకపోయాం. మాకు ప్లే ఆఫ్స్ చేరే అర్హత లేదు.' అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.