Faf du Plessis: అతని బ్యాటింగ్ వల్లే ఓడాం!
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే ఘోర పరాజాయాన్ని ఎదుర్కొన్నామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. పిచ్ కండిషన్స్ తమకు ప్రతికూలంగా మారాయని తెలిపాడు. 'తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఛేజింగ్‌లో బ్యాటింగ్ మరింత సులువు అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్‌కు చాలా కష్టమైంది.

పిచ్ కారణంగానే..
క్రీజులో సెట్ అయిన విరాట్ కోహ్లీ కూడా కాస్త ఇబ్బంది పడటం చూశాం. మేం కొన్ని విషయాలను విభిన్నంగా ప్రయత్నించాల్సింది. కానీ సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసారు. ఈ ఇద్దరూ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగారు. మేం మ్యాక్స్‌వెల్‌తో పాటు ఫింగర్ స్పిన్నర్లను ప్రయత్నించాలనుకున్నాం.
కానీ ఈ వికెట్‌పై అంతగా టర్న్ లభించలేదు. అంతేకుండా కేకేఆర్ బ్యాటర్లు లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగడంతో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేకపోయాం. మాకు రెండు వైపుల టర్న్ చేయగల మణికట్టు స్పిన్నర్ కావాలి. విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
కర్ణ్ శర్మను ఆడించాలని..
వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మను ఆడించాలనుకున్నాం. కానీ కట్టర్స్ అద్భుతంగా వేయగల విజయ్ కుమార్ వైశాఖ్‌ను బరిలోకి దించాం. ఆండ్రీ రస్సెల్ 80 శాతం కట్టర్స్‌తో సక్సెస్ అవ్వడం చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ వ్యూహం ఫలించింది. వైశాఖ్ బౌలింగ్‌లో మంచి వేరియేషన్స్ ఉన్నాయి.'అని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
నరైన్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 ) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47), ఫిల్ సాల్ట్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications