
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దమ్మున్న నాయకుడని.. అతడు మైదానంలో ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే అతడి విజయ రహస్యాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న డుప్లెసిస్.. తన సారథిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ సఫారీ ప్లేయర్ తాజాగా బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్భాల్‌తో ఫెస్‌బుక్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'కెప్టెన్ అంటే తరచూ జట్టు సమావేశాలు పెట్టి అందులో సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వాలానుకునేవాడిని. కానీ ధోనీని చూశాక తెలిసింది. అసలైన సారథి ఏం చేయాలోనని. అతడు ఎప్పుడు అనవసర మీటింగ్‌లు పెట్టడు. అతడి క్రికెట్ బుర్రకు ఎవరైనా జోహార్ అనాల్సిందే. పాదరసం కన్నా వేగంగా ఆలోచిస్తాడు. ఫీల్డ్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై అతడికి సరైన అవగాహన ఉంటుంది. దానికి తగ్గట్లే ముందుకు సాగుతాడు. మైదానంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏ మాత్రం సంకోచించడు ఆ ధైర్యమే ధోనీని దమ్మున్న నాయకుడిగా ముందు వరసులో నిలబెడుతుంది.'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఇక షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ నిర్వహించాలంటే.. అంతకు రెండు వారాల ముందే జట్లకు ఐసోలేషన్ విధించాలని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు ముందు ఆటగాళ్లను రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. అలాగే మెగాటోర్నీ ముగిసిన అనంతరం కూడా ఇదే ఫాలో అవ్వాలి అని డుస్లెసిస్ చెప్పుకొచ్చాడు.