బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. 15-20 పరుగులు తక్కువగా చేయడం విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'ఎప్పుడూ ఆడినా.. పవర్ ప్లే అనంతరం బ్యాటింగ్ వేగం కాస్త తగ్గుతుంది. మిడిల్ ఓవర్లలో చెన్నై జట్టు అద్భుతంగా ఆడుతోంది. స్పిన్నర్లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బహుషా మేం ఈ మ్యాచ్‌లో 15-20 పరుగులు తక్కువ చేశామనుకుంటా. మేం తొలి 10 ఓవర్లలో ఆడినంత చెత్తగా అయితే పిచ్ లేదు. చేజింగ్‌లో చెన్నై ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మాపై ఆధిపత్యం చెలాయించింది.

కొన్ని వికెట్లు తీసేందుకు మేం ప్రయత్నం చేసినా.. చివరకు డిఫెండ్ చేసుకునే స్కోర్ మా దగ్గర లేదు. ఈ పిచ్ ఎప్పుడూ ముందుగా బ్యాటింగ్ చేయడానికి అనుకూలం. గతేడాది ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే భారీ స్కోర్లు చేశాయి. మా స్పిన్నర్లకు కాస్త పట్టుదొరికింది. చాలా రోజులుగా క్రికెట్ ఆడిన దినేశ్ కార్తీక్ రాణించడం జట్టుకు కలిసొచ్చే అంశం. అనూజ్ రావత్ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చాడు. యువ ప్లేయర్‌గా ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు కావాల్సిన విలువైన పరుగులు చేశాడు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ వికెట్ కీపర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 95 పరుగులు జోడించారు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(23 బంతుల్లో 8 ఫోర్లతో 35) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), శివమ్ దూబే(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్), రవీంద్ర జడేజా(17 బంతుల్లో సిక్స్‌తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో కామెరూన్ గ్రీన్(2/27) రెండు వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.