రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ వేడుకలు తొక్కిసలాట ఘటనతో విషాదంగా ముగిసాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. దాంతో ఆ జట్టు అభిమానులు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కూడా బెంగళూరు వేదికగా భారీ స్థాయిలో విజయోత్స వేడుకలను నిర్వహించింది. అయితే చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్‌సీబీ విజయోత్సవం కాస్త విషాదంగా మారింది. అయితే ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి.
ఆర్‌సీబీ అత్యుత్సాహమే ఈ ఘటనకు కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు. తొందరపాటుతో విజయోత్సవ వేడుకలు నిర్వహించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. కాస్త సమయం తీసుకొని వేడుకలు జరుపుకొని ఉంటే 11 మంది ప్రాణాలు దక్కేవని తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టి కర్ణాటక ప్రభుత్వం ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్‌తో పాటు డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్‌లను అరెస్ట్ చేసింది. కర్ణాటక క్రికెట్ అసిసోయేన్ అధికారులపై కూడా కేసు నమోదైంది.

ఈ ఘటనపై సీరియస్ అయిన బీసీసీఐ.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా వేడుకల విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీపై ఏడాది పాటు నిషేధం విధించిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆర్‌సీబీని ఐపీఎల్ నిర్వాహకులు అన్‌ఫాలో చేశారని, వచ్చే ఏడాది ఆర్‌సీబీ ఆడకపోవచ్చని పలువురు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు.
అయితే ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైంది. ఆర్‌సీబీని ఐపీఎల్ అన్‌ఫాలో చేసిందనే వార్తల్లో నిజం లేదు. అలాగే ఆర్‌సీబీపై నిషేధం విధించే అవకాశం కూడా లేదని ఆర్‌సీబీ ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. ఆర్‌సీబీపై నిషేధం విధిస్తే బీసీసీఐకే భారీ నష్టమని హెచ్చరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి కూడా అండగా ఉంటామని చెప్పింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం రూ. 25 లక్షల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.