ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికతను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు.
కాదేదు నకిలీకి అనర్హం అన్న రీతిలో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. క్రీడాకారులపై డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు రూపొందిస్తూ శునకానందం పొందుతున్నారు. పాత ఇంటర్వ్యూల వీడియోల సాయంతో అనని మాటలు అన్నట్లు మాయ చేస్తున్నారు. ఫేక్ అనే ఆలోచన కూడా రాకుండా వీడియో క్రియేట్ చేస్తున్నారు.

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబం నుంచి విరాట్ కోహ్లీ వరకు చాలా మంది ఆటగాళ్లు ఈ నకిలీగాళ్లతో ఇబ్బంది పడ్డారు. తాజాగా భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు సంబంధించి ఓ ఫేక్ వీడియోను సృష్టించి నెట్టింట వైరల్ చేశారు. ఏ మాత్రం సందేహం రాకుండా.. నిజమేనని నమ్మేలా వీడియోను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌ఛల్ చేస్తోంది.

స్మృతి మంధానకు సంబంధించి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూను కేటుగాళ్లు పూర్తిగా మార్చేసారు. ఆ ఇంటర్వ్యూలోని వాయిస్ తీసేసి ఏఐ సాయంతో కొత్త వాయిస్‌ని జోడించారు. టీమిండియా యువ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అంటే నాకు క్రష్ అని స్మృతి మంధాన చెప్పినట్లుగా ఈ వీడియోను క్రియేట్ చేశారు.
ఈ నకిలీ వీడియోలో హోస్ట్.. టీమిండియా ఆటగాళ్లలో మీ క్రష్ ఎవరా? అని అడగ్గా.. స్మృతి మంధాన అభిషేక్ శర్మ పేరు చెప్పింది. అక్కడికే కట్ చేసి.. బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్‌లో అభిషేక్ శర్మ, స్మృతి మంధాన ఒకరినొకరు చూసుకున్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారు. ఈ వీడియో నిజమేనని నమ్మిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
ఏఐ టూల్స్ ద్వారా ఈ వీడియోను క్రాస్ చెక్ చేయగా ఫేక్ అని తేలింది. అసలు ఏ ఇంటర్వ్యూలో కూడా మంధాన తన క్రష్ అభిషేక్ శర్మ అని చెప్పలేదు. ఏ హోస్ట్ కూడా టీమిండియాలో మీ క్రష్ ఎవరా? అని అడగలేదు. అడగరు కూడా. ఈ లాజిక్ గుర్తించిన జనాలు ఈ వీడియో నిజమేనని నమ్ముతున్నారు.
చాలా ఇంటర్వ్యూలలో స్మృతి మంధాన తన క్రష్ గురించి అడిగినప్పుడు, తనకు చిన్నప్పటి నుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన ప్రేమాయణం నడిపింది. కానీ వీరి వివాహం పెళ్లి పీటలపై ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పలాష్ ముచ్చల్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉండటంతోనే స్మృతి పక్కనపెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.